టాలీవుడ్లో ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకవైపు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతుండగా, మరోవైపు ఈ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి తప్ప.. ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ స్పందించలేదని పలువురు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే రీసెంట్గా సత్యదేవ్ సహా పలువురు హీరోలు స్పదించగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసిన అనంతరం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తన స్పందనను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ, ఆయన ప్రదర్శన ఎంతో శక్తివంతంగా, సహజంగా ఉందని పేర్కొన్నారు. శారీరక రూపాంతరం, భావ వ్యక్తీకరణలు, నృత్యం వంటి ప్రతి అంశంలో చరణ్ అద్భుతంగా మెప్పించారని అన్నారు. ఆయన ట్వీట్‌ను గమనిస్తే…
‘‘నిన్న రాత్రి ‘పెద్ది’ చూశాను. మై డియర్ రామ్ చరణ్.. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆయన నటన ఎంతో నేచురల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది. అతని మేకోవర్ అసాధారణంగా ఉండగా, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. ప్రతి అంశంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. నా సోదరుడి గురించి నిజంగా గర్వంగా ఉంది. ఆయన ఈ ప్రశంసలకు పూర్తిగా అర్హుడు. ఇక జగపతి బాబు గారి నటన కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంది. అలాగే చిత్రంలోని ఇతర నటీనటులందరూ అద్భుతంగా నటించారు. కథానాయిక జాన్వీ కపూర్‌కు నా ప్రేమాభివందనాలు. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలందరికీ అభినందనలు. దీనికి కెప్టెన్లా వ్యవహరించిన దర్శకుడు బుచ్చి బాబు సానాకి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రతి యాక్టర్లోని టాలెంట్‌ను మరింతగా వెలికితీసి, ముఖ్యంగా చరణ్ గారిని అత్యున్నత స్థాయిలో ఆవిష్కరించారు. ‘పెద్ది’ చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు”అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదే సమయంలో ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.315 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ భారీ వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు నమోదు కావడం చిత్ర విజయాన్ని ప్రతిబింబిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు రావడం, అదే సమయంలో భారీ కలెక్షన్లు నమోదు కావడంతో ‘పెద్ది’ చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, సినిమా మరింత పెద్ద రికార్డులు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు.