Save The Tigers – Season 3 Trailer out
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లతో విశేష ఆదరణ పొందిన ఈ సిరీస్, జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన సీజన్ 3 ట్రైలర్ వినోదం, ఫాంటసీ, ఎమోషన్స్ మేళవింపుతో ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ప్రారంభంలోనే పెళ్లి, దాంపత్య జీవితం గురించి అభినవ్ గోమటం చెప్పే సరదా డైలాగులు నవ్వులు పూయిస్తాయి. రాహుల్, విక్రమ్, ఘంటా రవి పాత్రలు తమ జీవితాల గురించి చర్చిస్తుండగా కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. “మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్” అనే కాన్సెప్ట్‌ను వినూత్నంగా చూపిస్తూ, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Save The Tigers – Season 3 Trailer out –
ఈ సీజన్లో పాత్రల జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తాయి. ఘంటా రవి ఎమ్మెల్యేగా, రాహుల్ ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయితగా, విక్రమ్ కార్పొరేట్ కంపెనీ సీఈవోగా మారడం కథపై ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ మార్పులు ఎలా జరిగాయి? అవి నిజమా లేక మరో ప్రపంచంలో జరుగుతున్నాయా? అనే సందేహాలను ట్రైలర్ ఆసక్తికరంగా వదిలిపెడుతుంది.
కామెడీకి తోడు ఫాంటసీ అంశాలను జోడిస్తూ, రెండు విభిన్న ప్రపంచాల మధ్య సాగే కథనంతో ఈసారి సీజన్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం సరదా క్షణాలతో నిండిపోయి ఉండగా, చివర్లో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి తదితరులు తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. అలాగే హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రదీప్ అద్వైతం, మహి వి. రాఘవ్ రూపొందించిన ఈ సిరీస్‌ను శివ మేక, సాహితీ చింతలపూడి నిర్మించారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించగా, విశ్వేశ్వర్ సిలకోటి సినిమాటోగ్రఫీ అందించారు. అజయ్ అరసాడ సంగీతం సమకూర్చగా, విజయ్ నామోజు, డి.ఎస్. గౌతమ్ రచన అందించారు.
ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మ్యారేజ్ లైఫ్, ఫాంటసీ ఎలిమెంట్స్, కామెడీని కలిపి రూపొందించిన ‘సేవ్ ది టైగర్స్ 3’ జూన్ 19 నుంచి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించేందుకు సిద్ధంగా ఉంది.