Vijay Deverakonda Fires Back at Negativity
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్న జంటగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి”. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Vijay Deverakonda Fires Back at Negativity
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో “రణబాలి” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై విజయ్ స్ట్రాంగ్‌గా స్పందించారు.
“నా కలలు, నా శ్రమ కొందరికి అనవసరం అనిపిస్తే నేనేం చేయాలి? నా హానెస్టీ వాళ్లకు అహంకారంగా అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపుగా కనిపిస్తే నేను తగ్గాలా? నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే ఇంట్లో కూర్చోవాలా? నేను మారను.. వాళ్లు మారాలి” అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కొంతమంది గ్రూపులుగా మారి తనపై నెగిటివిటీని సృష్టిస్తున్నారని విజయ్ అన్నారు. అలాంటి విషయాలపై దృష్టి పెట్టకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. “మీరు కూడా బాగుపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. ఇలా వెనక్కి లాగే పనులు చేస్తే ఉపయోగం ఉండదు” అని విజయ్ వ్యాఖ్యానించారు.
తన కెరీర్లో “రణబాలి” ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని విజయ్ దేవరకొండ నమ్మకం వ్యక్తం చేశారు. రాహుల్ సంకృత్యన్ ఈ కథ చెప్పినప్పుడే ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న గొప్ప స్క్రిప్ట్స్‌లో ఇదొకటి అనిపించిందన్నారు. రణబాలి, జయమ్మ, హెక్టార్‌తో పాటు సినిమాలోని ప్రతి క్యారెక్టర్, కథ జరిగే ఊరు, తన అమ్మ ఊరైన శింగనమల వంటి అంశాలను రాహుల్ ఎంతో అద్భుతంగా రాశారని విజయ్ తెలిపారు. కరువు అనే అంశాన్ని మన కల్చర్, మాస్ హీరోయిజంతో ముడిపెట్టి రాహుల్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు.
ఈ సినిమా కేవలం ఒక కథ కాదని, మన పూర్వీకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారో, మనలో ఎలాంటి డీఎన్ఏ ఉందో తెలుసుకునే అవకాశం కల్పిస్తుందని విజయ్ అన్నారు. బుర్రకథల్లో, జానపదాల్లో నిలిచిపోయిన వీరుల కథలను ప్రపంచానికి బిగ్ స్క్రీన్‌పై చూపించే ప్రయత్నమే “రణబాలి” అని చెప్పారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ “శ్యామ్ సింగరాయ్” తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో తన దగ్గరకు ఒక బుర్రకథ వచ్చిందన్నారు. ఆ కథలోని వీరుడి పాత్ర తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. ఆ వీరుడి కథ ఆధారంగా రాయలసీమ చరిత్రను పరిశోధించే క్రమంలో “ది గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ఫామైన్” గురించి తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు. రెండేళ్ల పాటు కొనసాగిన ఆ కరువు కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన చారిత్రక నేపథ్యం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అనేక పుస్తకాలు చదివి, వివిధ ప్రాంతాలకు వెళ్లి చరిత్రకారులను కలిసిన తర్వాత ఈ కథను ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డామని, ఇది ఒక యుద్ధంలాంటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని రాహుల్ అన్నారు.

నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ రాహుల్ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశారని, కథకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆథెంటిక్‌గా చూపించేందుకు రెండేళ్ల పాటు నిరంతరం వర్క్ చేశారని తెలిపారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం భారీగా ఎఫర్ట్స్ పెట్టారని, “రణబాలి” పాత్ర కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారని చెప్పారు. రాయలసీమ స్లాంగ్, పాత్ర బిహేవియర్, ప్రతి చిన్న డీటెయిల్లో విజయ్ చూపించిన పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉందని రవిశంకర్ ప్రశంసించారు. రశ్మిక కూడా “జయమ్మ” పాత్రలో అద్భుతంగా నటించిందన్నారు. విజయ్‌తో తనకు దాదాపు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని చెప్పిన రవిశంకర్.. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం సరైనది కాదని అన్నారు. “విజయ్ చాలా మంచి వ్యక్తి. ఆయన సినిమాలు, ఆయన క్యారెక్టర్ వరకే మాట్లాడతారు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు” అంటూ విజయ్‌కు మద్దతుగా నిలిచారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ రాహుల్ చెప్పిన కథ తమను ఎంతో ఎగ్జైట్ చేసిందని, ఆయన చెప్పినదానికంటే అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని అన్నారు. విజయ్‌కు “రణబాలి” పర్ఫెక్ట్ మూవీ అని, ఇందులో ఆయన నట విశ్వరూపం చూపించారని చెప్పారు. విజయ్–రశ్మిక జంటగా పెళ్లి తర్వాత తమ సినిమాలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.