VarunSandesh -Shwetabasu Reunite After 15 Years
ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా విభిన్నమైన కథాంశాలతో సిరీస్‌లను అందిస్తున్న ఆహా.. మరో ఆసక్తికరమైన ఒరిజినల్‌తో వచ్చేందుకు సిద్ధమైంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ నెల 22 నుంచి ఆహాలో ఈ సిరీస్ ప్రీమియర్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
VarunSandesh -Shwetabasu Reunite After 15 Years
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కంఠంనేని నిర్మించిన ఈ సిరీస్‌కు స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి… టీజర్ చాలా బాగుందని, ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరారు.

టీజర్‌ను గమనిస్తే.. పెద్దలు కుదిర్చిన సంబంధంతో వరుణ్ సందేశ్, శ్వేతా బసు పెళ్లి చేసుకుంటారు. మొదట్లో వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే పెళ్లిచూపుల సమయంలోనే శ్వేత తన గురించి చెప్పిన ఓ విషయం వరుణ్‌ను షాక్‌కు గురిచేస్తుంది. ఆ తర్వాత అనూహ్యంగా ఆమె కనిపించకుండా పోవడం కథలో అసలు ట్విస్ట్‌కు తెరలేపుతుంది. తన భార్య కనిపించడం లేదంటూ వరుణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో టీజర్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు శ్వేత చెప్పిన విషయం నిజమేనా? ఆమె అకస్మాత్తుగా ఎందుకు మాయమైంది? ఆమె మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? పోలీసులు ఆమె ఆచూకీని కనుగొనగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే అన్నట్లుగా టీజర్‌ను కట్ చేశారు.
కామెడీ, మ్యారేజ్ డ్రామా, మిస్టరీ అంశాలను మిక్స్ చేస్తూ ‘నా వైఫ్ మిస్సింగ్’ సిరీస్‌ను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా భార్య అదృశ్యం కావడం చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. మరి ఈ మిస్టరీకి ఎలాంటి ముగింపు ఇచ్చారో తెలియాలంటే ఈ నెల 22 వరకు వేచి చూడాల్సిందే.