Vadde Naveen Transfer Trimurthulu Review
రివ్యూ : ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
నటీనటులు : వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్, దేవి ప్రసాద్, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు
కథ, కథనం, దర్శకత్వం : కమల్ తేజ నార్ల
బ్యానర్ : వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పీ
నిర్మాత : వడ్డే నవీన్
సినిమాటోగ్రఫీ : కార్తిక్ సుజాత సాయికుమార్
ఎడిటర్ : విజయ్ ముక్తవరపు
మ్యూజిక్ – : కళ్యాణ్ నాయక్
విడుదల తేదీ : 19/06/2026
సెన్సార్ : యూ/ఏ
నిడివి : 2 గంటల 33 నిమిషాలు
Vadde Naveen Transfer Trimurthulu Review
ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో వడ్డే నవీన్.. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కంబ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది. మరి వడ్డే నవీన్ రీ ఎంట్రీ విజయవంతమైందా? ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవండి.
కథ విషయానికొస్తే..
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్) ఎక్కడ పనిచేసినా అవినీతికి ఎదురొడ్డి నిలవడంతో తరచూ బదిలీలకు గురవుతుంటాడు. అందుకే అందరూ అతన్ని ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అని పిలుస్తుంటారు. ఓసారి అతను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్) తన కుమారుడు సంతోష్ బాబు (వివేక్ రఘువంశీ) రాజకీయ భవిష్యత్తు కోసం సానుభూతి నాటకం ఆడుతుంది. ఆ ప్లాన్‌ను త్రిమూర్తులు భగ్నం చేయడంతో అతన్ని శిక్షగా మూతపడినట్టే ఉన్న ఓ పాత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. అక్కడ దుమ్ముకొట్టిన పాత కేసు ఫైళ్లను పరిశీలిస్తుండగా, తన తండ్రి మరణించిన రోజున నమోదైన ఓ ఎఫ్ఐఆర్ అతని కంటపడుతుంది. ఆ కేసు సీఎం కుమారుడిపై ఓ గిరిజన యువతి ప్రియమ్మపై జరిగిన లైంగిక దాడికి సంబంధించినదని తెలుసుకుంటాడు. అయితే అదే కేసుకు పరస్పర విరుద్ధంగా ఉన్న మరికొన్ని ఎఫ్ఐఆర్ కాపీలు బయటపడటంతో త్రిమూర్తులకు భారీ కుట్ర జరిగినట్లు అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత అతను చేపట్టిన దర్యాప్తులో ఎలాంటి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి? అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరిగిన నేరాలను ఎలా బయటపెట్టాడు? చివరికి సీఎం కుటుంబానికి ఎలా చెక్ పెట్టాడు? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే ..
దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ నిజాయితీ గల పోలీస్ పాత్రలో సహజంగా కనిపించారు. ముఖ్యంగా ఆయన లుక్స్, ఫిట్నెస్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. 55 ఏళ్ల వయసులోనూ తెరపై ఎంతో యంగ్‌గా కనిపించడం విశేషం. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తనదైన శైలిలో నటించారు. అయితే యాక్షన్ సీక్వెన్స్‌లు, రన్నింగ్ షాట్స్, కొన్ని డ్యాన్స్ మూవ్స్‌లో మాత్రం వయసు ప్రభావం కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కొత్తగా అనిపించినా, కొన్ని చోట్ల ఆ వాయిస్ పూర్తిగా పాత్రకు సింక్ కాలేదనే భావన కలుగుతుంది. హీరో భార్య పాత్రలో రాశీ సింగ్ ట్రెడిషినల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంది. ఉన్నంత స్క్రీన్ టైమ్‌లో సహజంగా నటించినప్పటికీ, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో నటిగా తన ప్రతిభను పూర్తిగా చూపించే అవకాశం దక్కలేదు. ముఖ్యమంత్రి కమల పాత్రలో శిల్పా తులస్కర్ గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించారు. అధికార హోదాకు తగ్గ హావభావాలు పలికించినా, పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశం స్క్రిప్ట్ ఇవ్వలేదు. ఆమె కుమారుడు సంతోష్ బాబు పాత్రలో వివేక్ రఘువంశీ ప్రతినాయకుడిగా ఓకే అనిపించినా, పాత్రలో మరింత తీవ్రత ఉండాల్సిన భావన కలుగుతుంది. దేవి ప్రసాద్ తక్కువ నిడివి ఉన్న పాత్రలోనూ తన అనుభవాన్ని చూపించారు. వడ్లమాని శ్రీనివాస్ కోర్టు సన్నివేశాల్లో తన మార్క్ నటనతో ప్రత్యేకంగా నిలుస్తారు. రఘుబాబు అక్కడక్కడా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. బేబీ ఊహా, బాబా భాస్కర్, శివన్నారాయణ, సమ్మెట గాంధీ తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. అయితే చాలా పాత్రలు పరిమితంగా ఉండటం, వాటిని మరింత బలంగా మలిచే అవకాశం లేకపోవడం వల్ల వారి నటన పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేదు.
టెక్నికల్ విషయానికొస్తే..
సాంకేతికంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ నాయక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్‌పై కనిపించని ఎమోషన్‌ను కూడా ఆర్ఆర్ ఎలివేట్ చేసింది. పాటలు వినడానికి బాగున్నప్పటికీ, వాటి ప్లేస్మెంట్ మాత్రం కథకు అడ్డుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను నీట్‌గా, కలర్ఫుల్గా చూపించింది. అయితే ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండి, అనవసర సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే సినిమా నిడివి, స్క్రీన్‌ప్లే మరింత ప్రభావవంతంగా ఉండేది. దర్శకుడు కమల్ తేజ నార్ల మంచి ఉద్దేశంతో కమర్షియల్ అంశాలను జోడించినప్పటికీ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ఇక నిర్మాతగా వడ్డే నవీన్ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు తగిన స్థాయిలో ఖర్చు పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..
నిజాయితీ గల పోలీసు అధికారం అండతో నేరాలు చేసే రాజకీయ నాయకులను ఎదుర్కోవడం అనే కథాంశం తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాదు. అలాంటి రొటీన్ పాయింట్‌ను ఎంచుకున్నప్పుడు కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను నిలబెట్టాలి. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కూడా అదే ప్రయత్నం చేసింది. రాజకీయాలు, దర్యాప్తు, కోర్టు డ్రామా అంశాలను కలిపి కమర్షియల్ థ్రిల్లర్‌గా మలచాలని దర్శకుడు కమల్ తేజ నార్ల ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా సాగడంతో అసలు కాన్ఫ్లిక్ట్లోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ట్రాక్ మొదలైన తర్వాత సినిమా కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫైళ్ల వెనుక దాగిన నిజాలు బయటపడే సన్నివేశాలు, క్లైమాక్స్ కోర్టు ఎపిసోడ్ పర్వాలేదనిపిస్తాయి. అయితే దర్యాప్తు ప్రక్రియ, కొన్ని కీలక ట్విస్టులు మరింత పదునుగా ఉండి ఉంటే సినిమా ఇంకాస్త ఎంగేజింగ్‌గా మారేది. మరోవైపు కథలో లాజిక్కు అందని కొన్ని సన్నివేశాలు, నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, సందర్భం లేకుండా వచ్చే పాటలు సినిమాకు మైనస్‌గా మారాయి. సీరియస్‌గా సాగాల్సిన కథలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కథనాన్ని మరింత వీక్ చేసేలా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ డ్రామా ఆశించినంత థ్రిల్ ఇవ్వదు. దర్శకుడి టేకింగ్ కూడా నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కాకుండా పాత తరహాలో అనిపించే సందర్భాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లోని కోర్టు సీన్లో ‘టెంపర్’ చిత్రంలోని సీన్ గుర్తు చేసేలా ఉంటుంది. అయితే చాలా కాలం తర్వాత వడ్డే నవీన్‌ను హీరోగా చూడటం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలాలు.
ప్లస్ పాయింట్స్ :
వడ్డే నవీన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫిట్నెస్
పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ కథాంశం
కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
సెకండాఫ్‌లోని కొన్ని దర్యాప్తు, కోర్టు సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, పాత తరహా టేకింగ్
నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్
లాజిక్ మిస్ అయిన కొన్ని సన్నివేశాలు
అనవసరమైన పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్
ఆశించిన స్థాయిలో మెప్పించని ఇన్వెస్టిగేషన్, స్క్రీన్‌ప్లే
ఫైనల్‌గా : ఈ చిత్రంలో మంచి ఉద్దేశం, మంచి కథ కథనం ఉన్నప్పటికీ… దాన్ని పూర్తిస్థాయిలో ఆసక్తికరమైన పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మలచడంలో మాత్రం సినిమా పూర్తిగా విజయవంతం కాలేకపోయింది. వడ్డే నవీన్ కంబ్యాక్‌ను చూడాలనుకునే ప్రేక్షకులు ఒకసారి ప్రయత్నించొచ్చు. కానీ కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.
రేటింగ్ : 2/5