maa inti bangaram movie review
రివ్యూ : మా ఇంటి బంగారం
నటీనటులు : సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, చైతన్య కృష్ణ, గవిరెడ్డి, మంజూష ముక్కవిల్లి, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు
దర్శకత్వం : బీవీ నందిని రెడ్డి
కథ, కథనం : రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి
బ్యానర్ : ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్
నిర్మాతలు : రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు
సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్
ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
మ్యూజిక్ – : సంతోష్ నారాయణన్
విడుదల తేదీ : 19/06/2026
సెన్సార్ : యూ/ఏ
నిడివి : 2 గంటల 34 నిమిషాలు
maa inti bangaram movie review
‘ఓ బేబీ’ తర్వాత సమంత ఫిమేల్ లీడ్‌గా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంతో దాదాపు మూడేళ్ల తర్వాత సమంత స్ర్కీన్‌పై కనిపించింది. మరీ ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
స్వర్ణ అలియాస్ ఝాన్సీ (సమంత) చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి, తనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండాలని కలలు కంటుంది. ఆ కోరికతోనే డాక్టర్ అనిరుధ్ (దిగంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రేమ వివాహం కారణంగా అనిరుధ్ తన కుటుంబానికి దూరమవుతాడు. రెండేళ్ల తర్వాత చెల్లెలి పెళ్లి సందర్భంగా భార్యతో కలిసి తన స్వగ్రామం బల్లవరానికి వస్తాడు. ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆ కుటుంబంలో అందరి మనసులు గెలుచుకోవడానికి స్వర్ణ తనవంతు ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో జైలులో ఉన్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కరుణ (గుల్షన్ దేవయ్య) అనుచరులు ఝాన్సీ (సమంత) కోసం బల్లవరానికి చేరుకుంటారు. దీంతో స్వర్ణ గతం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. కరుణకు ఝాన్సీకి ఉన్న సంబంధం ఏమిటి? తన గతాన్ని కుటుంబానికి ఎందుకు దాచిపెట్టింది? ఆ ప్రమాదం నుంచి తన భర్తతో పాటు మొత్తం కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? చివరికి స్వర్ణ నిజంగా ఎవరు? అనేదే ‘మా ఇంటి బంగారం’ కథ.
ఎవరెలా చేశారంటే ..
‘మా ఇంటి బంగారం’ పూర్తిగా సమంత భుజాలపై నడిచే సినిమా. స్వర్ణగా ఫ్యామిలీ ఉమెన్‌గా కూల్ లుక్‌లో అందరినీ ఆకర్షించింది. అలాగే నక్సలైట్ ఝాన్సీగా కూడా ఆమె మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ పూర్తి స్థాయిలో మెప్పించింది. ముఖ్యంగా రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా పాత్రకు మరింత బలం చేకూర్చింది. విలన్ కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ, పాత్రను బలంగా తీర్చిదిద్దకపోవడంతో అతని విలనిజం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు. అనిరుధ్ పాత్రలో దిగంత్ సహజంగా నటించినా, తన నటనను పూర్తిగా ప్రదర్శించే అవకాశం మాత్రం దక్కలేదు. శ్రీముఖికి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కగా, ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. సమంత స్నేహితురాలిగా మంజూష తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతుంది. ఆనంద్, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, గౌతమి తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించినప్పటికీ, వారికి మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అతిథి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించినంతసేపు తనదైన వినోదాన్ని అందించాడు.
టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకురాలు నందినీ రెడ్డి తనకు అలవాటైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఈ సినిమాలో కూడా బాగా హ్యాండిల్ చేశారు. అయితే క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా అంశాలను బ్యాలెన్స్ చేసే విషయంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినా, మరికొన్ని చోట్ల కథనం నెమ్మదించడం వల్ల సినిమా సాగదీతగా అనిపిస్తుంది. రాజ్ నిడిమోరు అందించిన కథ కొత్తది కాకపోయినా, అందులో ఉన్న ఎమోషనల్ పాయింట్ బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే మరింత పదునుగా ఉండి ఉంటే సినిమా ఇంకాస్త ప్రభావం చూపేదనే భావన కలుగుతుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. పాటలు కథకు అనుగుణంగా సాగుతాయి. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెర వేసి ఉంటే కథనం మరింత వేగంగా అనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, కొన్ని చోట్ల మరింత గ్రాండియర్ ప్రొడక్షన్ ఉంటే సినిమా స్థాయి ఇంకాస్త పెరిగేదనే భావన కలుగుతుంది.
maa inti bangaram movie review
సినిమా ఎలా ఉందంటే..
‘మా ఇంటి బంగారం’ కథ పరంగా చూస్తే కొత్తదనం పెద్దగా లేదు. గతాన్ని దాచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించే కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కావు. అయితే ఇప్పటివరకు హీరోల చుట్టూ తిరిగిన ఈ తరహా కమర్షియల్ టెంప్లేట్‌ను ఈసారి హీరోయిన్ ఓరియెంటెండ్గా చూపించడం సినిమాకు కొంత కొత్త ఫీల్ తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్ అంశాలను కలిపి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. అసలు ‘అతడు’ చిత్రంలో మహేష్ బాబు ప్లేస్‌లో సమంతను పెడితే ఎలా ఉంటుందో అలాగే సినిమా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా కుటుంబ సభ్యుల పరిచయం, స్వర్ణ వారి మనసులు గెలుచుకునే ప్రయత్నాలు, ఆమె గతంపై సస్పెన్స్‌తో సాగుతుంది. కొన్ని ఎలివేషన్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్ ఆసక్తిని పెంచినా, కథనం అక్కడక్కడ నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్‌లో స్వర్ణ అసలు వ్యక్తిత్వం బయటపడిన తర్వాత సినిమా వేగం అందుకుంటుంది. ముఖ్యంగా సమంతపై రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కమర్షియల్‌గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆమెకు ఇచ్చిన హీరో స్థాయి ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే సినిమాకు ప్రధాన బలహీనత రొటీన్ కథ. కథలో వచ్చే మలుపులు చాలా వరకు ముందే ఊహించగలిగేలా ఉంటాయి. ముఖ్యంగా విలన్ కరుణ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే హీరోయిజం ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. అలాగే స్వర్ణ–అనిరుధ్ దాంపత్య బంధం, కుటుంబంతో ఆమెకు ఏర్పడే అనుబంధాన్ని మరింత భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా, అది పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కామెడీకి కూడా మంచి స్కోప్ ఉన్నప్పటికీ, అది ఆశించినంతగా పండలేదు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన అంశాలు కూడా కొంత హడావుడిగా ముగిసిన భావన కలుగుతుంది. అయినప్పటికీ, ఈ లోపాలను చాలా వరకు సమంత తన నటనతో కవర్ చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆమె పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే భావోద్వేగాలు, కమర్షియల్ ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ అంశాలు రెండూ ఉండటం సినిమాకు ప్లస్. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా, సమంత స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని బాగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. మొత్తం మీద ‘మా ఇంటి బంగారం’ కొత్త కథను ఆశించే వారికి పూర్తిగా సంతృప్తి ఇవ్వకపోయినా, సమంత నటనతో పాటు ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూసేలా అనిపించే చిత్రంగా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
సమంత వన్ ఉమెన్ షో..
క్లైమాక్స్, సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్
ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ కావడం.
సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
రొటీన్, ముందే ఊహించగలిగే కథ.
నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, సాగదీత ఫీలింగ్
కొన్ని లాజిక్కు దూరంగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు
ఫైనల్‌గా : ‘మా ఇంటి బంగారం’ మేలిమి బంగారం అయితే కాదు..
రేటింగ్ : 2.5/5