KiranAbbavaram Reality Sangeeth Song Out
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో పాటు భజ గోవిందం, రుత్తు పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. తాజాగా వెడ్డింగ్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మరో అదిరిపోయే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
KiranAbbavaram Reality Sangeeth Song Out
సినిమాలోని సంగీత్ సాంగ్‌ను కాకినాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా విడుదల చేశారు. పెళ్లి వేడుకల్లో కనిపించే సందడి, కుటుంబ సభ్యుల మధ్య ఉండే సరదాలు, స్నేహితుల అల్లరి.. ఇలా ఒక పెళ్లి వేడుకకు కావాల్సిన అన్ని హంగులను ఈ పాటలో చూపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన హుషారైన సంగీతం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సంగీత్ వేడుకకు అతిథులను ఆహ్వానిస్తూ కిరణ్ అబ్బవరం కనిపించడంతో పాట మొదలవుతుంది. ముందుగా ముసలి వాళ్లు (వయసులో పెద్దవాళ్లు) డ్యాన్స్ చేస్తూ కనిపించగా, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కొక్కరుగా వేడుకలో చేరడంతో సందడి మరింత పెరుగుతుంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు మధ్య సరదా సన్నివేశాలు, బావా మరదళ్ల చిలిపి ఆటపట్టింపులు, యూత్‌ఫుల్ డ్యాన్సులు పాటకు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
‘‘నేనెడికెళ్ళి పోదునమ్మ గోంగూరకి.. అట్ట సెప్పుకుంటూపోయాను గుంటూరుకి.. పెద్ద గాలివాన తగలగానే మోటారుకి.. అయ్యో ఆగిపాయే దగ్గర్లో నెల్లూరుకి.. కట్ట గోంగూర తేకుండా మా ఊరికి నా ముఖం ఎట్ట సూపాలి మా వారికి.. అరె ఆడా ఇడా తిరిగినాను.. ఈడకొచ్చిపడ్డాను గోంగూరకి.. బాగున్నారా బాగున్నారా.. బావగారు.. మరదలి కోసం చూస్తున్నారా ఎదురుమీరు..’ అంటూ సురేష్ గంగుల అందించిన సాహిత్యం పెళ్లి వేడుకల వాతావరణానికి చక్కగా సరిపోయింది. వేదవతి భాగవతరిణి, కుంచె రఘు, రోహిణి సొర్రాట్, శ్రీకృష్ణ, సాహితి చాగంటి, నల్గొండ నర్సన్న తమ గాత్రాలతో పాటకు మరింత కళ తీసుకొచ్చారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన పెప్పీ ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్ వినేవారిని కూడా స్టెప్పులేయించేలా ఉన్నాయి.
విజయ్ పొలాకి కొరియోగ్రఫీ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణ. కిరణ్ అబ్బవరం, దేవిక భట్ ప్రధానంగా కనిపించగా, పూజిత పొన్నాడ కూడా డ్యాన్స్‌తో సందడి చేశారు. సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటీనటులు సైతం ఉత్సాహంగా స్టెప్పులేయడం పాటకు ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ పెళ్లి వేడుకల రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించేలా విజువల్స్‌ను రూపొందించారు.
ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ కామారసు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25నన ‘రియాలిటీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.