Srinath Maganti’s ENE Repeat Success
ఒకప్పుడు విమర్శలు.. మరొకవైపు ఎన్నో సందేహాలు.. ఇప్పుడు మాత్రం ప్రశంసల వర్షం! యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రయాణం ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ‘ENE Repeat’లో కార్తీక్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, తన నటనతో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సుశాంత్ రెడ్డి పోషించిన కార్తీక్ పాత్రకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో, ఆ స్థానంలో శ్రీనాథ్‌ను ఊహించుకోవడం చాలామందికి కష్టమైంది. అయితే సినిమా విడుదలయ్యాక ఆ అనుమానాలన్నింటికీ తన నటనతోనే సమాధానం చెప్పాడు ఈ యంగ్ హీరో.
Srinath Maganti’s ENE Repeat Success
తొలి భాగం ‘ఈ నగరానికి ఏమైంది’ లో కార్తీక్ పాత్రకు సుశాంత్ రెడ్డి తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి పాత్రను మరో నటుడు పోషించడమంటే కచ్చితంగా పెద్ద సవాలే. వ్యక్తిగత కారణాలు, కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సుశాంత్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం శ్రీనాథ్ మాగంటిని వరించింది. అయితే ఈ ఎంపికపై మొదట్లో కొంత నెగెటివిటీ కనిపించింది. సుశాంత్ స్థాయిలో శ్రీనాథ్ మెప్పించగలడా? ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలడా? అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరిగాయి.
దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న సినిమాలో భాగం కావడమే గొప్ప అవకాశంగా భావించిన శ్రీనాథ్, కార్తీక్ పాత్ర కోసం తన శాయశక్తులా ప్రయత్నించాడు. నిజానికి షూటింగ్ ప్రారంభంలోనే అతడి నటనపై మేకర్స్‌కు పూర్తి సంతృప్తి కలగకపోతే మరో నటుడిని ఎంపిక చేసుకునే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ శ్రీనాథ్ తన పెర్ఫార్మెన్స్తో ఆ అవసరమే లేకుండా చేశాడు. కార్తీక్ పాత్రలో సహజంగా ఒదిగిపోతూ, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా సినిమాలోని ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అతడి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. శివాత్మికతో వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమా విడుదలకు ముందు శ్రీనాథ్‌పై వచ్చిన విమర్శలు కాస్తా ప్రశంసలుగా మారిపోయాయి. సుశాంత్ రెడ్డితో పోలికలు పెట్టినవారే ఇప్పుడు శ్రీనాథ్ నటనను అభినందిస్తున్నారు. ఒక పాత్రను మరో నటుడు పోషించినప్పుడు ఎదురయ్యే సహజమైన పోలికలను దాటుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో శ్రీనాథ్ సక్సెస్ అయ్యాడు.
ఈ ప్రయాణం గురించి శ్రీనాథ్ చెప్పిన మాటలు కూడా భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. తన నటనతో దర్శక, నిర్మాతలు సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరో నటుడిని తీసుకోవాలనుకున్నారని, కానీ సినిమా విడుదలై తాను కూడా అందులో భాగం కావడమే తనకు దక్కిన అతిపెద్ద గుర్తింపు అని పేర్కొన్నాడు.
గతంలో ‘హిట్’, ‘యానిమల్’ వంటి సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటికి ‘ఈ నగరానికి ఏమైంది 2’ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా కార్తీక్ పాత్రతో తనలోని కామెడీ టైమింగ్, నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఇకపై మరింత వైవిధ్యమైన పాత్రలు, లీడ్ రోల్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ‘ENE Repeat’తో శ్రీనాథ్ మాగంటి తన కెరీర్లో కొత్త జోష్‌ను నింపుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ప్రయాణం ఇప్పుడు హీరోగానూ అందరినీ అలరించేందుకు సిద్దంగా ఉన్నాడు.