సింగీతం–నాగ్ అశ్విన్ : లెజెండరీ టచ్, మోడర్న్ విజన్
94 ఏళ్ల వయసులోనూ డైరెక్టర్గా సింగీతం
94 ఏళ్ల వయసులో కూడా సృజనాత్మకతకు ఎలాంటి హద్దులు లేవని మరోసారి నిరూపించేందుకు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో, యువ విజనరీ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి ‘సింగ్ గీతం’ అనే టైటిల్ను అనౌన్స్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన సంఘటనగా చెప్పదగ్గ విషయం ఏమిటంటే 94 ఏళ్ల వయసులో సింగీతం గారు మళ్లీ డైరెక్టర్ చైర్ ఎక్కడం. ఇది కేవలం ఓ సినిమా ప్రాజెక్ట్ మాత్రమే కాదు; ఇది ఒక లెజెండ్ తిరిగి తన సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చూపించే సందర్భం. ‘పుష్పక్’ వంటి మూకీ క్లాసిక్, ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ మైలురాయి సినిమాలతో ఆయన ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. కమల్ హాసన్తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి.
తాజాగా ఆయన ‘సింగ్ గీతం’ అనే మ్యూజికల్ ఫీస్ట్ను రూపొందిస్తున్నారు. సింగీతం గారి అనుభవం, నాగ్ అశ్విన్ ఆధునిక విజన్కు తోడు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లపై ఈ సినిమా రూపొందడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. భారతదేశంలో అరుదుగా కనిపించే మ్యూజికల్ ఫాంటసీ జానర్లో ‘సింగ్ గీతం’ రూపొందుతోంది. సంగీతం, మ్యాజికల్ రియలిజం, ఫాంటసీ ఎలిమెంట్స్ సహా అన్ని ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది. ఇది కేవలం వినోదం కాదు, ఒక అనుభూతి అని టీమ్ చెబుతోంది. ఒక రహస్య గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో, ప్రతాప్ అనే యువకుడు తన జీవిత ప్రయాణంలో అనుకోని మలుపులు ఎదుర్కొంటాడు. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలో అతను పడే సంఘర్షణలు అభివృద్ధి వర్సెస్ పరిరక్షణ వంటి సామాజిక అంశాలను కూడా ఈ సినిమా టచ్ చేస్తుంది. యంగ్ లీడ్ కాస్ట్ అయిన ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే నటన కనబరిచారు. ఫాంటసీకి హాస్యాన్ని మేళవించడంలో సింగీతం గారి ప్రత్యేక శైలి మరోసారి ఆకట్టుకుంది. టెక్నికల్గా కూడా సినిమా బలంగా ఉంది. అంకూర్ సి సినిమాటోగ్రఫీ విజువల్గా ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కథకి ప్రత్యేకమైన మూడ్ని క్రియేట్ చేసింది. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మూలే క్రియేట్ చేసిన ప్రపంచం కథకి మరింత డెప్త్ ని తీసుకొస్తుంది. ప్రొడక్షన్ విల్యూస్ గొప్ప స్థాయిలో ఉన్నాయి.
సినిమా విజువల్గా అద్భుతంగా ఉండేలా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, మ్యూజిక్ సహా అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ టీమ్ పని చేస్తోంది. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ ఫాంటసీ ప్రపంచానికి ప్రాణం పోస్తుందని చెప్పాలి. జూన్ 11న ‘సింగ్ గీతం’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయి అవుతుందా లేదా అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఒక లెజెండ్ చేతుల మీదుగా పుట్టిన ఈ మ్యూజికల్ ఫాంటసీ ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో చూడాలి.





