Sharwanand Bhogi Song Egilivaranga Out Now
తెలంగాణ పల్లె సంస్కృతి, మట్టి మనుషుల జీవనశైలి, గ్రామీణ సమాజంలోని వాస్తవాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘భోగి’. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ‘ఏగిలివారంగ’ పాట విడుదలైంది. టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రబృందం.. ఇప్పుడు పల్లె పరిమళాలను వెదజల్లే జానపద గీతంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది.
Sharwanand Bhogi Song Egilivaranga Out Now
1960ల కాలంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో ‘భోగి’ కథ సాగుతుంది. అప్పటి గ్రామీణ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలతో పాటు గ్రామీణ సమాజంపై భూస్వాముల ఆధిపత్యం వంటి అంశాలను ‘ఏగిలివారంగ’ పాటలో సహజంగా చూపించారు. కేవలం వినోదాన్ని అందించే పాటగానే కాకుండా.. ఒకప్పటి పల్లె జీవితాన్ని పరిచయం చేసే పాటగా ఇది ప్రత్యేకతను చాటుకుంటోంది.
‘‘ఎగిలి వారంగా లేసి, ఇల్లలికి పూధిచ్చి, దేగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి, కొట్టంలో బర్లు గొడ్లకు కుడితినే దాపించి, పజ్జొన్న గటకలోకి సల్లానీళ్లే పోసి, బుత్తంతా నోట్లోబెట్టి కడుమాది సద్ది గట్టి, సెలకల్లో తొవ్వబట్టి..” అంటూ ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ తెలంగాణ మాండలికంలో అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లె ప్రజల దైనందిన జీవితాన్ని, వారి పనిపాటలను, ఆహారపు అలవాట్లను, సంప్రదాయాలను ప్రతిబింబించే పదాలు పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. మరోవైపు జానపద సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో తనదైన బాణీతో పాటకు ప్రాణం పోశారు.
నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన పల్లె గొంతుతో పాటను మరింత సహజంగా వినిపించగా, నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ గాత్రాలతో జానపద వాతావరణాన్ని మరింత బలపరిచారు.
పాటలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ పల్లెటూరి పాత్రల్లో నేచురల్ లుక్‌లో కనిపిస్తున్నారు. వారి డీ గ్లామర్ లుక్స్‌తో పాటు అప్పటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతున్నాయి. కులవృత్తులు, గ్రామీణ ప్రజల జీవన పోరాటాలు, సామాజిక అంతరాలను చూపించిన తీరు పాటకు మరింత లోతును తీసుకొచ్చింది. దర్శకుడు సంపత్ నంది కథా ప్రపంచాన్ని పరిచయం చేయడంలో పాటనే ఒక కీలక సాధనంగా మలిచినట్లు కనిపిస్తోంది. సంగీతం, సాహిత్యం, విజువల్స్ సమన్వయంతో ‘భోగి’లోని పీరియడ్ నేపథ్యాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. డింపుల్ హయతి మరో హీరోయిన్గా నటిస్తుండగా, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత బాధ్యతలను భీమ్స్ సిసిరోలియో నిర్వహిస్తున్నారు.
టీజర్‌తో అంచనాలను పెంచిన ‘భోగి’.. ‘ఏగిలివారంగ’ పాటతో తన కథా ప్రపంచాన్ని, సంగీత శైలిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. పల్లె సంస్కృతి, జానపద సంగీతం, సామాజిక వాస్తవాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.