డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే సినిమా హిట్టైనట్టు అని అంటున్నారు ‘రాకాస’ చిత్ర బృందం. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇకపై వచ్చేదంతా తమకు లాభాలే అని ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే శుభసూచికంగా చెప్పొచ్చు. శుక్రవారం హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైత్రి నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ ‘నిహారిక గారు ‘రాకాస’ని అద్భుతంగా ప్రమోట్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం. మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సమ్మర్లో కూల్ బ్రీత్‌లా ఉండే చిత్రమిది. ఆద్యంతం నవ్వించారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ‘రాకాస’లో పార్ట్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి హ్యాపీగా నవ్వుకుని, ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ ఉంది. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. సింగిల్ స్క్రీన్లలో శుక్రవారం నుంచి ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం’ అని అన్నారు. నటులు సంగీత్ శోభన్, బ్రహ్మాజీ, దర్శకురాలు మానస శర్మతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ సన్నీ ,సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ యాదవ్, కృష్ణా డిస్ట్రిబ్యూటర్ పాండు, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.





