Nenevaru? Movie with Housefull Shows
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో దర్శకుడు చిరంజీవి తన్నీరు తెరకెక్కించిన సందేశాత్మక వినోదాత్మక చిత్రం ‘నేనెవరు?. మే 29న విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. మంచి కథ, బలమైన సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని అన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మితో పాటు చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి మాట్లాడుతూ, విడుదలైన ప్రతి కేంద్రంలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. రోజురోజుకూ ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన కథనం, చిన్నికృష్ణ అందించిన సంగీతం, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి, తారకరామారావు ఎడిటింగ్, శ్రీనివాస్ సంభాషణలు, ఎస్.ఎస్. వీరు రచించిన పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని నిర్మాతలు తెలిపారు.
Nenevaru? Movie with Housefull Shows
సినిమాలో సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు నేపథ్యంలో సాగే కీలక ఘట్టాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయని పేర్కొంది. “సినిమా చాలా బాగుంది”, “మంచి సందేశంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్”, “ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం” అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారని, ప్రేక్షకుల ఆదరణతో “నేనెవరు?” విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మరిన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శనకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడించింది.