ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్ లీడ్ రోల్స్‌లో రూపొందిన చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్స్‌గా నటించారు. ‘ఎఫ్‌ఐఆర్’ ఫేమ్ మను ఆనంద్ దర్శకుడు. ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ఆర్య మాట్లాడుతూ ‘దాదాపు మూడేళ్ల తర్వాత నా సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. సైంధవ్‌లో ఒక గెస్ట్ రోల్ చేశాను. పూర్తిస్థాయిలో ‘మిస్టర్ ఎక్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ సినిమా. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కలిసి గొప్ప అనుభూతి కలిగించేలా ఉంటుంది. గౌతమ్ చాలా కొత్త క్యారెక్టర్ చేశాడు. అతను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది. మంజు మేడం అద్భుతమైన యాక్షన్ చేశారు. ఆమె యాక్షన్ బిగ్ స్క్రీన్ మీద చాలా మంచి అనుభూతి ఇస్తుంది. అలాగే అతుల్య పాత్ర కూడా చాలా బాగా చేసింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది. తప్పకుండా సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. మంజు వారియర్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ మను నాకు బలమైన పాత్ర ఇచ్చారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాను ఇంత లావిష్‌గా నిర్మించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఆర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే గౌతమ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్ గారితో కలిసి నటించే అవకాశం దొరికింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా’ అని చెప్పారు. ఇదొక కొత్త తరహా యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ అని, చాలా భిన్నంగా ప్రయత్నించామని గౌతమ్ కార్తీక్ అన్నారు. డైరెక్టర్ మను ఆనంద్ మాట్లాడుతూ ‘ఇది చాలా క్లిష్టమైన కథ. అయితే మా నటీనటులందరూ పాత్రలను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా నటించారు. ఆర్య గారు, గౌతమ్, మంజు గారు, శరత్ కుమార్ గారు అందరూ అద్భుతంగా నటించారు. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులు కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ రైడ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారు’ అని చెప్పారు. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





