ఇటీవల మలయాళ సినిమాలకు తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తూనే ఉన్నాం. కంటెంట్ బాగుంటే స్టార్స్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తున్నారు. తాజాగా కేరళ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భగవంత్ కేసరి’ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తమ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి, విపిన్ దాస్, ఇతర నిర్మాతలతో కలిసి మలయాళంలో నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం OTTలో అందుబాటులో ఉన్న ఈ మూవీ సిరీస్ (franchise) మొదటి భాగం, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి ఊహించని రీతిలో అద్భుతమైన ఆదరణను పొందింది. అందులోని విభిన్నమైన హాస్యం, యువతను ఆకట్టుకునే కథనం, వాస్తవికమైన కథాంశం ఒక బలమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. దీంతో సహజంగానే, ఈ సీక్వెల్ థియేటర్లలో విడుదల కాబోతుండటంతో దానిపై అంచనాలు భారీగా పెరిగాయి.





