సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న, రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా థడానీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. శ్రీనివాసు, మంగ అనే ఇద్దరు ప్రేమికుల ప్రయాణం, వారి జీవితంలో ఎదురైన ఊహించని మలుపులే ఈ చిత్ర కథాంశంగా టీజర్ ద్వారా రివీల్ చేశారు. ‘‘మంగ లేకపోతే ఈ శ్రీను గాడు తిరుపతి వదలి వెళ్లే ప్రసక్తే లేదు..” లాంటి డైలాగ్స్ స్టోరీలోని ఇంటెన్సెటీని తెలియజేస్తున్నాయి. హీరోహీరోయిన్స్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. జయకృష్ణ తన ఫస్ట్ మూవీకే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. ఎమోషన్స్, ఇంటెన్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నింటినీ బ్యాలన్స్ గా చూపిస్తూ ఆకట్టుకున్నాడు. తన లుక్స్, ఎనర్జీతో భవిష్యత్తులో మాస్ హీరోగా ఎదిగే ఆత్మవిశ్వాసాన్ని ఇందులో చూపించాడు. రాషా థడాని ప్రేమకథకు మరింత ఫ్రెష్ నెస్ తీసుకువచ్చింది. మోహన్ బాబు విలన్ గా కనిపిస్తూ కథలో ఉత్కంఠను పెంచారు. అలాగే అజయ్ భూపతి మార్క్ లవ్ సీన్స్‌తో పాటు రా అండ్ రస్టిక్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రేమను ప్రకటించేందుకు గాల్లో తుపాకీ కాల్చే సన్నివేశాలు, తర్వాత హీరోపై తుపాకీ గురిపెట్టే విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ తిరుపతి వాతావరణాన్ని సహజంగా, అద్భుతంగా చూపించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 60 శాతం పూర్తవగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందని టీమ్ చెప్పింది.





