Mahesh Babu Wraps Varanasi Shoot
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి తాజాగా కీలకమైన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు 20 నెలలుగా సాగుతున్న జర్నీలో మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను పూర్తి చేశారు.
Mahesh Babu Wraps Varanasi Shoot
2025 జనవరి 24న ‘SSMB29’ పేరుతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. భారీ ప్రీ-ప్రొడక్షన్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు 2026 సెప్టెంబర్ 22న మహేష్ బాబు తన పోర్షన్‌ను పూర్తి చేయడంతో ఈ సినిమా నిర్మాణంలో మరో కీలక దశ ముగిసింది. జనవరి 24, 2025 నుంచి సెప్టెంబర్ 22, 2026 వరకు మహేష్ ఈ ప్రాజెక్ట్ కోసం సుదీర్ఘంగా పనిచేశారు.
‘SSMB29’ నుంచి ‘వారణాసి’ వరకు..
మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాకు ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే 2025 నవంబర్‌లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన భారీ ఈవెంట్లో సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో మహేష్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు ‘రుద్ర’ అని రివీల్ చేశారు. మహేష్ ఫస్ట్ గ్లింప్స్‌లో త్రిశూలం చేతబట్టి, ఎద్దుపై కనిపించిన విజువల్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
మహేష్‌కు పూర్తిగా కొత్త అవతార్..
‘వారణాసి’లో మహేష్ బాబు ఇప్పటివరకు కనిపించని తరహా పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. రుద్ర పాత్రలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ శైలి అన్నీ కొత్తగా ఉండేలా రాజమౌళి డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన విజువల్స్‌ను బట్టి చూస్తే ఇది కేవలం ఒక సాధారణ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కాదనే విషయం స్పష్టమవుతోంది. పురాణ అంశాలు, అడ్వెంచర్, యాక్షన్, టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌ల కలయికతో భారీ ప్రపంచాన్ని రాజమౌళి సృష్టిస్తున్నట్లు గ్లింప్స్, ఈవెంట్ వివరాలు సూచిస్తున్నాయి.
ప్రియాంక చోప్రా.. పృథ్వీరాజ్‌తో ఇంటర్నేషనల్ స్కేల్
ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆమె భారతీయ సినిమాలో నటిస్తుండటం కూడా ‘వారణాసి’కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన ‘కుంభ’ అనే పాత్రను పోషిస్తున్నారు. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌ల కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని తీసుకొచ్చింది.
భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ముందుగానే ఫినిషింగ్..
‘వారణాసి’ షూటింగ్ గురించి రాజమౌళి గతంలో ఇచ్చిన అప్డేట్ కూడా ఆసక్తికరంగా ఉంది. 2026 జూన్‌లో సినిమా కోసం ముఖ్యమైన భారీ యాక్షన్, స్పెక్టాకిల్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, ఇక చిన్న చిన్న ఇంటర్‌కనెక్టింగ్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తిచేయాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా పరిణామాలు చూస్తే ఆ ప్లాన్‌కు అనుగుణంగానే సినిమా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2026 నాటికి షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందని తెలుస్తోంది.
షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా..
రాజమౌళి సినిమాలకు సాధారణంగా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ‘వారణాసి’ విషయంలో షూటింగ్‌తో పాటు VFX, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పనులు కూడా సాగుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే సినిమాకు ఇది కీలకమైన ప్రక్రియగా మారింది. ఈ సినిమాను IMAX ఫార్మాట్లో కూడా రూపొందించేందుకు అనుగుణంగా విజువల్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. కథను IMAX కోసం మార్చలేదని, అయితే IMAX, CinemaScope రెండింటికీ సరిపోయేలా సన్నివేశాలను ఫ్రేమ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
రాజమౌళి–మహేష్ కాంబోకు ఇదే అసలు హైలైట్
మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో యాక్షన్, మాస్, క్లాస్ పాత్రలు పోషించినప్పటికీ ‘వారణాసి’ మాత్రం పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా అవుతుందని ఇప్పటివరకు వచ్చిన విజువల్స్ సూచిస్తున్నాయి. ఇక రాజమౌళి విషయానికి వస్తే ‘బాహుబలి’, ‘RRR’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ‘RRR’ తర్వాత మరోసారి భారీ స్థాయి యాక్షన్, అంతర్జాతీయ నేపథ్యం, పురాణ అంశాలు, సాంకేతిక అద్భుతాలను కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సినిమా ప్రెజెంటేషన్ ద్వారా తెలుస్తోంది.
అనుకున్న టైమ్‌కే రిలీజ్
ఇక జక్కన్న స్పీడ్ చూస్తుంటే ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7నే ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీగా రాబోతున్న ‘వారణాసి’.. చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 50 భాషల్లో డబ్ చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు 120 దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీతో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, అరబిక్, జపనీస్, కొరియన్ వంటి పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.