టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న కిరణ్.. త్వరలో దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటుడిగానే కాక, క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రీసెంట్గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో నిర్మాతగాను కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తనే హీరోగా నటిస్తూ, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్‌తోపాటు తనే స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాల్లోకి రాకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన అనుభవం కిరణ్‌కు ఉంది. కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల మేకింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కిరణ్.. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా తన విజన్‌ను తెరపై చూపించాలని భావిస్తున్నారట. ఇటీవల ‘క’, ‘కె-ర్యాంప్’ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం.. మరోవైపు ‘గువ్వల చెరువు ఘాట్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా ఆయన తీసుకుంటున్న కొత్త నిర్ణయం ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ‘రియాలిటీ’ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.





