Kartikeya’s Comeback Begins
‘ఆర్ఎక్స్ 100’తో ఒక్కసారిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఆ తర్వాత హీరోగా విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు విలన్‌గానూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ వంటి చిత్రాలతో విలన్‌గా కూడా మెప్పించారు. అయితే గత కొంతకాలంగా కార్తికేయ నుంచి కొత్త సినిమా తెరపై కనిపించలేదు. ఈ విరామం తర్వాత ఆయన ఎలాంటి సినిమాతో తిరిగి వస్తారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరదించుతూ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆసక్తికరంగా ఈసారి కార్తికేయ కేవలం హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Kartikeya’s Comeback Begins
‘కమ్‌బ్యాక్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తికేయ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయన సతీమణి లోహితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘కమ్‌బ్యాక్’ టైటిల్‌ను కేవలం సినిమాకు పెట్టిన పేరుగా కాకుండా.. కార్తికేయ ప్రస్తుత కెరీర్ పరిస్థితికి కూడా ప్రతీకగా చూపించినట్టుగా గ్లింప్స్‌ను రూపొందించారు. బాక్సింగ్ ప్రపంచంలో ఒకప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మూడేళ్ల తర్వాత తిరిగి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అతడిని చూసే వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ సాగింది.
‘మూడేళ్లుగా కనిపించలేదు.. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు?’ అనే సందేహాన్ని వ్యక్తం చేసే సంభాషణలతో మొదలైన గ్లింప్స్.. ఆ తర్వాత హీరో జీవితంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లింది. బాక్సింగ్ రింగ్‌లోకి తిరిగి అడుగుపెట్టే వ్యక్తిగా కార్తికేయను పరిచయం చేశారు. స్కిప్పింగ్ చేస్తూ, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన కార్తికేయ.. ఈ పాత్ర కోసం తన లుక్‌ను, ఫిజిక్‌ను మరోసారి ప్రత్యేకంగా మలచుకున్నట్టు కనిపించారు. ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన బాక్సింగ్ విజువల్స్, హీరో ఇంటెన్స్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
కార్తికేయ కెరీర్లో ఈ సినిమా మరో కారణంతోనూ ప్రత్యేకంగా నిలవనుంది. ఇంతవరకు నటుడిగా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దీంతో ‘కమ్‌బ్యాక్’ ఆయనకు ఒక సాధారణ కమ్‌బ్యాక్ సినిమా కాకుండా.. కెరీర్లో కొత్త అధ్యాయానికి ఆరంభంగా మారింది.
హీరోగా తెరపై కనిపిస్తూనే కథను, నటీనటుల పెర్ఫార్మెన్స్ను, టెక్నికల్ టీమ్‌ను ఎలా నడిపిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. పైగా సినిమా నేపథ్యం బాక్సింగ్ కావడంతో యాక్షన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇచ్చారనేది కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.
విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చింది. బాక్సర్‌గా హీరో రీ-ఎంట్రీని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ సాగింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కూడా కథకు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి.