Itlu Arjuna Telugu Movie Review
చిత్రం : ఇట్లు అర్జున
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అనీష్, అనస్వర రాజన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ముఖేష్ రుషి, రఘుబాబు, గెటప్ శ్రీను, కలైయరసన్ హరికృష్ణన్, ఎలాంగో కుమారవేల్ తదితరులు
బ్యానర్ : వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : వెంకీ కుడుముల
సమర్పణ : నాగార్జున అక్కినేని
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : మహేష్ ఉప్పల
సంగీత దర్శకుడు : తమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : రాజా మహదేవన్
ఎడిటర్ : కోటి కె
విడుదల తేదీ : నవంబర్ 13, 2026
Itlu Arjuna Telugu Movie Review
వెరైటీ కథాంశం, కొత్త హీరో ప్రయోగం, ప్రేమ, కామెడీ, యాక్షన్, క్రైమ్ అంశాల కలయికతో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, నాగార్జున ప్రజెంటర్‌గా వ్యవహరించడం, పలువురు స్టార్ హీరోలు ప్రమోషన్స్‌లో భాగం కావడంతో సినిమాపై విడుదలకు ముందే ఆసక్తి ఏర్పడింది. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? కొత్త హీరో అనీష్ తన తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్నాడా? తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
అర్జున్ (అనీష్) చిన్నప్పటి నుంచి మాటలు రాని యువకుడు. తండ్రితో కలిసి చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటు పడిన అతడికి, ఆ కారణంగా సమాజంలోనూ ఓ దొంగ అనే ముద్ర పడుతుంది. మరోవైపు తన ఎదురింట్లో ఉండే కీర్తి (అనస్వర రాజన్)ను అర్జున్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాడు. కానీ తన మనసులోని ప్రేమను ఆమెకు చెప్పే ధైర్యం మాత్రం చేయలేడు. మాటలు రాని అర్జున్ తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడనే అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే, మరోవైపు పెద్దన్న (ముఖేష్ రుషి) అనే గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం తెరపైకి వస్తుంది. ఈ లావాదేవీకి సంబంధించిన కీలక సమాచారం ఉన్న పెన్‌డ్రైవ్, పుస్తకం ఓ గుర్తు తెలియని వ్యక్తి చేతికి చిక్కుతాయి. దీంతో పెద్దన్న గ్యాంగ్ ఆ వ్యక్తి కోసం వేట మొదలుపెడుతుంది. అనుకోకుండా ఈ వ్యవహారంలోకి అర్జున్, కీర్తి ఇద్దరూ ప్రవేశిస్తారు. అసలు ఈ వెయ్యి కోట్ల వ్యవహారం ఏమిటి? అర్జున్‌కు, పెద్దన్న గ్యాంగ్‌కు మధ్య సంబంధం ఏంటి? ఈ ప్రమాదం నుంచి అర్జున్, కీర్తి ఎలా బయటపడ్డారు? తన ప్రేమను అర్జున్ కీర్తికి చెప్పగలిగాడా? అనేది మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
తొలి సినిమాతోనే హీరోగా పరిచయమైన అనీష్ మంచి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మాటలు రాని యువకుడి పాత్రను ఎంచుకోవడం సాహసమే. డైలాగులు లేకుండానే హావభావాలతో భావాలను పలికించాల్సిన పాత్రలో అతను మెప్పించాడు. సైన్ లాంగ్వేజ్, విజిల్స్ ద్వారా తన భావాలను వ్యక్తపరిచే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన ఈజ్ చూపించాడు. కొత్త హీరో అయినప్పటికీ ఎక్కడా అనుభవం లేని నటుడిలా కనిపించలేదు. కీర్తి పాత్రలో అనస్వర రాజన్ చాలా సహజంగా నటించింది. తన ఎనర్జీ, అందం, నటనతో సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, రఘుబాబు తమ పాత్రల పరిధి మేరకు అలరించారు. ముఖేష్ రుషి గ్యాంగ్‌స్టర్‌గా తనకు అలవాటైన శైలిలో కనిపించగా, కలైయరసన్, ఎలాంగో కుమారవేల్ విలన్ పాత్రల్లో మెప్పించారు.
టెక్నికల్ టీమ్ గురించి..
సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథకు బలాన్ని ఇచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన మరింత బీజీఎం బాగుంది. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. విజువల్స్, లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. కోటి ఎడిటింగ్ బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో మరికొంత క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా కాకుండా, అంతకుమించి కనిపిస్తాయి. కొత్త హీరోతో ఇంత భారీ స్థాయిలో సినిమా నిర్మించిన వెంకీ కుడుముల ప్రయత్నాన్ని అభినందించాలి.
సినిమా ఎలా ఉందంటే..
సాధారణంగా ప్రేమకథ, గ్యాంగ్‌స్టర్ క్రైమ్ కథలను కలిపి తెరకెక్కించడం కొత్తేమీ కాదు. కానీ హీరోకు మాటలు రాని పాత్రను ఇవ్వడం ద్వారా దర్శకుడు మహేష్ ఉప్పల కథకు ఓ కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. అర్జున్ పాత్రను పరిచయం చేసిన విధానం, అతడి ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నాలు ఫస్టాఫ్‌లో ఆసక్తికరంగా సాగుతాయి. మరోవైపు వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం, పెన్‌డ్రైవ్ కోసం గ్యాంగ్ చేసే వేట కథలో ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. వారి మధ్య స్నేహం, ప్రేమ చిగురించే తీరు బాగుంది. కామెడీ కూడా కథకు అడ్డంకిగా మారకుండా అక్కడక్కడా రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో కథ పూర్తిగా హవాలా వ్యవహారం, గ్యాంగ్‌స్టర్ ఎపిసోడ్స్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, మరికొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా పెద్దన్న గ్యాంగ్‌కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను మరింత కొత్తగా రాసుకోవాల్సింది. అక్కడక్కడా కథలో లాజిక్కు అందని అంశాలు కూడా కనిపిస్తాయి. అయినప్పటికీ చివరి భాగంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, తమన్ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. కొత్త హీరోతో ఓ సాధారణ కథను ఎంచుకుని, అందులో కమర్షియల్ అంశాలను జోడించిన దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగినదే. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బలంగా తయారయ్యేది.
ప్లస్ పాయింట్స్ :
– అనీష్ నటన, కొత్త హీరో పరిచయం
– అనస్వర రాజన్ పెర్ఫార్మెన్స్
– హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్
– ఫస్టాఫ్ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్
– తమన్ సంగీతం, నేపథ్య సంగీతం
– నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
– రొటీన్ కథ
– సెకండాఫ్‌లో అక్కడక్కడా నెమ్మదించే కథనం
– స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు
– ఇంకాస్త బలంగా ఉండాల్సిన క్లైమాక్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘ఇట్లు అర్జున’ ఓ కొత్త హీరోను పరిచయం చేస్తూనే, ప్రేమ, కామెడీ, క్రైమ్, యాక్షన్ అంశాలను కలిపి అందించే మోస్తరు కమర్షియల్ ఎంటర్టైనర్. మాటలు రాని యువకుడిగా అనీష్ చేసిన ప్రయత్నం, అనస్వర రాజన్‌తో అతడి కెమిస్ట్రీ, తమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలు. కథలో కొత్తదనం పూర్తిస్థాయిలో లేకపోయినా, హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వీకెండ్లో ఓసారి సరదాగా చూడదగిన సినిమా ‘ఇట్లు అర్జున’.