Husharu 2 Teaser Launch Event
2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘హుషారు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘హుషారు 2’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్లరి, కామెడీతో మొదలైన టీజర్.. యాక్షన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి పాత్ర, ‘తమ్ముళ్లు వేట మొదలెడదామా’ అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Husharu 2 Teaser Launch Event

ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘హుషారు 2’లో తనకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శ్రీ హర్షకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత ఓ మంచి పాత్రలో నటించానని, ‘హుషారు’లో కంటే ఎక్కువగా నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగ సమస్య, శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడం వంటి అంశాలను సినిమాలో బలంగా చూపించారని పేర్కొన్నారు. యువత స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుందని అన్నారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. టీజర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతుందని, ఇందులో తమ నలుగురి పాత్రలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయని చెప్పారు. ఆర్. నారాయణమూర్తి పాత్ర తమకు గురువులా ఉంటుందని, టీజర్లో చూసిన దానికంటే సినిమాలో మరింత వినోదం ఉంటుందని తెలిపారు.
రాహుల్ రామకృష్ణ కూడా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజర్‌కు మించి సినిమా ఉంటుందని అన్నారు. నటుడు దినేష్ తేజ్ మాట్లాడుతూ.. ‘హుషారు’ రోజులు గుర్తొచ్చాయని, మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీ హర్షతో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ‘హుషారు’తో పోలిస్తే పది రెట్ల వినోదాన్ని ‘హుషారు 2’ అందిస్తుందని అన్నారు.
దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ.. ‘హుషారు’ తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమని, రెండో భాగాన్ని కేవలం సీక్వెల్ తీయాలనే ఉద్దేశంతో రూపొందించలేదని చెప్పారు. తన స్నేహితులతో కలిసి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ‘హుషారు 2’ను తెరకెక్కించినట్లు వెల్లడించారు. తన చిన్ననాటి స్నేహితుడు రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాతగా మారడం సంతోషంగా ఉందన్నారు. ఆర్. నారాయణమూర్తితో కలిసి పనిచేయడం వెలకట్టలేని అనుభవమని, ఆయనతో వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలను వెల్లడిస్తామని తెలిపారు.
నిర్మాత రాహుల్ వర్మ మాట్లాడుతూ.. ‘హుషారు’ తనకు ఎంతో ఇష్టమైన చిత్రమని, అందులో తన జీవితాన్ని చూసుకున్నట్లు అనిపించిందని చెప్పారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ను నిర్మించడం ఆనందంగా ఉందని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నటి విధి యాదవ్ కూడా ప్రేమ, స్నేహం, హాస్యం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ సినిమా కోసం చిత్ర బృందమంతా ఎంతో కష్టపడిందని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రామిశెట్టి సైతం దర్శకుడు శ్రీ హర్షతో తనకు మంచి అనుబంధం ఉందని, ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్లపై రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.