Hrithik Roshan for James Bond?
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ప్రతిష్టాత్మక వేడుకలో ఆయన సందడి చేయడమే కాకుండా, అక్కడ తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఇప్పుడు హృతిక్ పేరు మరోసారి గ్లోబల్ సినీ వర్గాల్లో మార్మోగుతోంది. అంతేకాదు.. ఆయనను తదుపరి జేమ్స్ బాండ్‌గా చూడాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు.
Hrithik Roshan for James Bond?
ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 15వ ఎల్ఏసీఎంఏ ఆర్ట్ + ఫిల్మ్ గాలాకు హృతిక్ రోషన్ హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హాజరైన తొలి భారతీయ నటుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన నిర్మాత కవితా గుప్తా ఈ కార్యక్రమంలో హృతిక్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బ్రునెల్లో కుసినెల్లి రూపొందించిన డార్క్ బ్లూ టక్సెడోలో హృతిక్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్మాన్, ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్తో హృతిక్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డెనిస్ విల్లెన్యూవ్తో హృతిక్ కలిసి కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎందుకంటే తదుపరి జేమ్స్ బాండ్ చిత్రానికి డెనిస్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే కొత్త బాండ్ ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఫొటోలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదే అదనుగా హృతిక్ అభిమానులు తమ మనసులోని కోరికను బయటపెడుతున్నారు. ‘డెనిస్.. అసలైన జేమ్స్ బాండ్ మీ ముందే ఉన్నాడు. హృతిక్‌ను తదుపరి బాండ్‌గా ఎంపిక చేయండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే బాండ్ ఐకానిక్ లుక్‌లో హృతిక్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఆయన నటించిన ‘ధూమ్’ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలను జేమ్స్ బాండ్ థీమ్‌తో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.
నిజానికి జేమ్స్ బాండ్ పాత్రకు అవసరమైన స్టైలిష్ లుక్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఫిట్నెస్, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన ప్రదర్శన.. ఇలా అన్ని అంశాల్లోనూ హృతిక్ సరిపోతాడనేది అభిమానుల అభిప్రాయం. అందుకే ఈసారి బాండ్ రేసులో భారతీయ స్టార్‌కు అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను జేమ్స్ బాండ్ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ పరిగణనలోకి తీసుకుంటారా? హృతిక్‌కు అంతర్జాతీయ గూఢచారి పాత్రలో నటించే అవకాశం వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.