DSP’s Yellamma Gets a Release Date Locked
సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘బలగం’తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
DSP’s Yellamma Gets a Release Date Locked
ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా దేవిశ్రీ ప్రసాదే అందిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. నటుడిగా ఆయన తెరపై ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
‘బలగం’ చిత్రంతో తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించిన వేణు యెల్దండి.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ను మరో ప్రత్యేకమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో సాగే ఈ కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండనుంది. విభిన్నమైన కథను తనదైన శైలిలో ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రకటించిన విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్తోంది.
తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ‘ఎల్లమ్మ’ను విడుదల చేయనున్నారు. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం.. దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా అరంగేట్రం చేయడం, వేణు యెల్దండి దర్శకత్వం వహించడం, దిల్ రాజు సమర్పణలో రూపొందుతుండటం వంటి ప్రత్యేకతలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.