Crazy Kalyanam Producer BoosamJaganMohanReddy Interview :
దసరా పండుగ వేళ ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను పంచేందుకు ‘క్రేజీ కళ్యాణం’ సిద్ధమవుతోంది. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన నిర్మాత.. సినిమా ప్రత్యేకతలు, నటీనటుల సహకారం, కథపై తమకున్న నమ్మకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ పండగ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ప్రత్యేక ఆకర్షణ
‘క్రేజీ కల్యాణం’ను అన్ని వర్గాల ప్రేక్షకులు కలిసి చూసేలా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించామని నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తొలుత ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, విడుదల తేదీల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో దసరా పండుగకు తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పండుగ సమయంలో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో తమ చిత్రానికి ఇది సరైన సమయమని భావించినట్లు చెప్పారు.
కథపై నమ్మకమే మా బలం
సినిమా విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని నిర్మాత స్పష్టం చేశారు. కథ విన్న ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారని, అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ వంటి నటీనటులు స్క్రిప్ట్‌ను అభినందించడం తమలో మరింత నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ, మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేసేందుకు నటీనటులంతా సహకరిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఉంటేనే సినిమా ఎక్కువ కాలం గుర్తుండిపోతుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, అందుకే కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన వివరించారు.
తెలంగాణ నేపథ్యం.. అందరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు
‘క్రేజీ కల్యాణం’ కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని, అయితే ఇందులోని భావోద్వేగాలు మాత్రం అందరికీ దగ్గరగా ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. తెలంగాణ జీవనశైలి, స్థానిక వాతావరణాన్ని సహజంగా చూపిస్తూనే, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ సులభంగా అర్థమయ్యేలా తెరకెక్కించామని తెలిపారు. ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో కనిపించే అనుబంధాలు, కుటుంబ సంబంధాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. వినోదంతో పాటు హృదయాన్ని తాకే ఎమోషన్స్ ఉంటాయని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘బొమ్మరిల్లు’ వంటి కుటుంబ కథాచిత్రాలు చూసినప్పుడు కలిగే ఫీల్ తమ సినిమాతోనూ ప్రేక్షకులకు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడేళ్ల కష్టం.. బడ్జెట్లోనే సినిమా పూర్తి
ప్రకటనల రంగంలో పనిచేస్తున్న తనకు సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉండేదని బూసం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దర్శకుడు బద్రప్ప గాజులతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని, కథలపై జరిగిన చర్చల్లో భాగంగానే ‘క్రేజీ కల్యాణం’ ఆలోచన కార్యరూపం దాల్చిందని వివరించారు. యాడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తనకు ఉన్న అనుభవం సినిమా నిర్మాణానికి ఉపయోగపడిందని చెప్పారు. దర్శకుడిగా బద్రప్పకు ఇది తొలి సినిమా అయినప్పటికీ, యాడ్ ఫిల్మ్స్ ద్వారా ఆయన ప్రతిభను దగ్గరగా చూశానని, కథపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించానని తెలిపారు. దాదాపు మూడేళ్లపాటు సినిమా కోసం పనిచేశామని, అనుకున్న బడ్జెట్లోనే చిత్రాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. నిర్మాతగా ఇది తన రెండో సినిమా అని పేర్కొన్నారు.
అనుపమ, నరేష్ పాత్రలు ఆకట్టుకుంటాయి
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని నిర్మాత చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా ఆమె తెలంగాణ యాస నేర్చుకోవడంతో పాటు వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొన్నారని తెలిపారు. నరేష్ వీకే సైతం యాసపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన పాత్రకు న్యాయం చేశారని అన్నారు. కథ విన్నప్పుడే అనుపమ ఈ పాత్రకు సరైన ఎంపికగా అనిపించారని, నరేష్ పోషించిన పాత్రకు కూడా ఆయనే సరిగ్గా సరిపోతారని భావించామని వివరించారు. తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలిచారని, ఈ సినిమా ఆయన నట ప్రయాణంలో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాటలు, సహజమైన లొకేషన్లు మరో ప్లస్
‘క్రేజీ కళ్యాణం’కు సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, డాక్టర్ గోరటి వెంకన్న మూడు పాటలు, కాసర్ల శ్యామ్ రెండు పాటలు, మిట్టపల్లి సురేందర్ ఒక పాట రాశారని చెప్పారు. సినిమాలో మొత్తం ఐదు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ ఉంటాయని వెల్లడించారు. మెదక్ పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో పూర్తిగా సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని తెలిపారు. కథకు అవసరమైన వాతావరణాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు రియల్ లొకేషన్లకే ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.
ప్రేక్షకుల ఆదరణపై ఆశలు
‘క్రేజీ కళ్యాణం’ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు చూసి మెచ్చుకున్నారని నిర్మాత తెలిపారు. సినిమా నచ్చడంతో బన్నీ వాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి విడుదలకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం సుమారు 200 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందని, ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి థియేటర్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని చెప్పారు.
సినిమాపై తమకున్న నమ్మకం ప్రేక్షకుల ఆదరణగా మారుతుందని ఆశిస్తున్నామని, తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం లభిస్తే తమిళం, మలయాళ ప్రేక్షకులకు కూడా సినిమాను చేరువ చేయాలని ఉందని తెలిపారు.