Brahmaji’s Powerful Look from Krishnambhaje
మార్కండేయుడిగా బ్రహ్మాజీ పవర్ఫుల్ అవతారం
భక్తిరస ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణంభజే’. జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. చిత్రంలో మార్కండేయుడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Brahmaji’s Powerful Look from Krishnambhaje
సోషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ స్వయంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో ఆయన మార్కండేయుడి పాత్రలో పవర్ఫుల్, ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో బ్రహ్మాజీ కనిపిస్తున్న తీరు పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లుక్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

పౌరాణిక, భక్తి అంశాలను ఆధునిక కథనానికి అనుగుణంగా మేళవిస్తూ దర్శకుడు నాగరాజ్ కొట్టే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథకు తగ్గట్టుగా విభిన్నమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో ‘కృష్ణంభజే’ను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో హీరోగా ప్రదీష్, హీరోయిన్గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. వీరితో పాటు మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంభాషణలను నటుడు రచ్చ రవి అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే టీజర్‌తో పాటు ఇతర ప్రచార చిత్రాలను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా విడుదలైన బ్రహ్మాజీ ఫస్ట్ లుక్‌తో ‘కృష్ణంభజే’పై అంచనాలు మరింత పెరిగాయి. శ్రీరాం గుప్త కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాము సి.ఎం, సూర్య మీసాల కెమెరామెన్స్‌గా, జి. రాకేష్ గౌడ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా
మంథెన త్రినాథ్, సత్య సొమేష్ సంగీతం అందిస్తున్నారు.