Allari Naresh Ramba Oorvasi Menaka Movie Review
చిత్రం : రంభ ఊర్వశి మేనక
రేటింగ్ : 2/5
నటీనటులు : అల్లరి నరేష్, సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
బ్యానర్ : హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు : రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : చంద్రమోహన్ చింతాడ
సంగీత దర్శకుడు : చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) :రామ్ రెడ్డి
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి
విడుదల తేదీ : సెప్టెంబర్ 4, 2026
Allari Naresh Ramba Oorvasi Menaka Movie Review
కథ విషయానికొస్తే…
సూరి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కంటుంటాడు. అది కేవలం అతని కల మాత్రమే కాదు.. తన తండ్రి నెరవేరని ఆశ కూడా. ఆ కలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే మరోవైపు అప్పుల్లో కూరుకుపోతాడు. సూరి కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఓ విచిత్రమైన మ్యాజిక్ పుస్తకంలో రంభ, ఊర్వశి, మేనకలకు సంబంధించిన రహస్యం ఉంటుంది. ఆ పుస్తకంలోని నియమం ప్రకారం ప్రత్యేకమైన ముగ్గు వేస్తే దేవకన్యలు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీర్చుతారనేది నమ్మకం. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నించిన సూరికి అనుకోకుండా ఒకరోజు ఆ అద్భుతం నిజమవుతుంది. రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి వస్తారు. అయితే దేవకన్యలు వచ్చారనే ఆనందంలో ఉన్న సూరికి పరిస్థితులు అంత సులభంగా మారవు. వారికి శక్తులు లేకపోవడం, సూరి అప్పుల సమస్యలు, ప్రేమ వ్యవహారం, తల్లి ఆరోగ్యం ఇలా వరుస సమస్యలు అతడిని చుట్టుముడతాయి. ఈ సమస్యలన్నింటి నుంచి సూరి ఎలా బయటపడ్డాడు? దేవకన్యలు అతడి జీవితాన్ని మార్చగలిగారా? అన్నదే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
అల్లరి నరేష్‌కు కామెడీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు తన టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన నరేష్.. ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీతో కనిపించే ప్రయత్నం చేశారు. అయితే సమస్య నటనలో కాదు.. ఆయనకు రాసిన పాత్రలో, కామెడీ సన్నివేశాల్లో ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్లలో మాత్రం నరేష్ తన అనుభవాన్ని చూపించారు. ముఖ్యంగా తల్లి పాత్రతో వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.
సురభికి కథలో పెద్దగా స్కోప్ లేకపోయినా తన పాత్రకు న్యాయం చేసింది. రంభ, ఊర్వశి, మేనకలుగా రాశీ సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్‌లు గ్లామర్‌తో స్క్రీన్‌ను కలర్ఫుల్గా మార్చే ప్రయత్నం చేశారు. వీకే నరేష్ కొన్ని చోట్ల తన టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ రెడ్డి పాత్ర కూడా కామెడీకి ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. వెన్నెల కిశోర్ కనిపించిన సన్నివేశాలు కొంత ఉపశమనం ఇస్తాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో ఓకే అనిపించారు.
టెక్నికల్ టీమ్ గురించి..
సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవలోకం, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న నేపథ్యంలో విజువల్స్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ వాటిని మరింత ఆసక్తికరంగా మలచాల్సింది. సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. సెట్స్, కలర్ టోన్ సినిమాకు ఫాంటసీ ఫీల్ తీసుకొచ్చాయి. చైతన్య భరద్వాజ్ సంగీతం కథకు పెద్దగా అదనపు బలం ఇవ్వలేకపోయింది. పాటలు గుర్తుండిపోయే స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాల ప్రభావాన్ని పెంచేలా పనిచేయలేదు. ఎడిటింగ్ విషయంలో మరింత కత్తెర అవసరమైంది. ముఖ్యంగా కామెడీ పేరిట వచ్చే కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లకుండా సాగదీసిన భావన కలిగిస్తాయి. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ ఎంచుకున్న పాయింట్లో ఫాంటసీ కామెడీకి మంచి స్కోప్ ఉంది. కానీ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను కొత్త తరహా ట్రీట్మెంట్తో చెప్పాల్సిన చోట పాత ఫార్ములానే నమ్ముకోవడం సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది.
సినిమా ఎలా ఉందంటే..
‘రంభ ఊర్వశి మేనక’ కథ వినడానికి ఆసక్తికరంగానే ఉంటుంది. దేవకన్యలు భూమిపైకి రావడం, సాధారణ వ్యక్తి జీవితంలో వారి ప్రవేశం, అప్పులు-ప్రేమ-కుటుంబ సమస్యల మధ్య ఫాంటసీ కామెడీని నడిపించాలనే ప్రయత్నం చేశారు. కానీ మంచి లైన్ ఉండటం మాత్రమే సరిపోదు. దాన్ని ప్రేక్షకుడిని నవ్వించేలా, ఆశ్చర్యపరిచేలా, కథతో ప్రయాణించేలా మలచాలి. ఇక్కడే సినిమా తడబడింది. ప్రారంభం నుంచే కథ ఏ దారిలో వెళ్లబోతుందో సులభంగా అర్థమవుతుంది. కామెడీ కోసం రూపొందించిన చాలా సన్నివేశాలు సహజంగా పుట్టినవి కాకుండా బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. పాత్రలు చేసే హడావుడి ఎక్కువగా ఉండటం వల్ల నవ్వు కంటే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇతర హీరోల స్ఫూఫ్‌లతో కాలం చెల్లిన కామెడీని చేశారనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కథలో వచ్చే మలుపు కాస్త ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో దేవకన్యల చుట్టూ మరింత వినోదం పండుతుందని ఆశించినా.. సినిమా మళ్లీ రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. అయితే చివరి భాగంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు కొంత ఊపిరి పోస్తాయి. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్‌తో కూడిన ఎపిసోడ్స్ కథలో ఉన్న కామెడీ కంటే ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ కూడా మిగిలిన సినిమాతో పోలిస్తే కొంత మెరుగ్గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్
ఫాంటసీ కామెడీకి ఉన్న ఆసక్తికరమైన మూలకథ
వెన్నెల కిశోర్, వీకే నరేష్‌ల కొన్ని సన్నివేశాలు
కలర్‌ఫుల్ విజువల్స్
చివరి భాగంలోని మదర్ సెంటిమెంట్
మైనస్ పాయింట్స్ :
పాత తరహా కామెడీ ట్రీట్మెంట్
నవ్వించని కామెడీ సన్నివేశాలు
ఇతర స్టార్ హీరోల స్ఫూఫ్‌లు
సాగదీసిన స్క్రీన్‌ప్లే
ఊహించదగిన కథనం
సెకండాఫ్‌లో తగ్గిన వేగం
సంగీతం పెద్దగా ప్రభావం చూపకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
అల్లరి నరేష్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ. అందుకే ఆయన మళ్లీ కామెడీ జోనర్లోకి రావడంతో ‘రంభ ఊర్వశి మేనక’పై ఆసక్తి ఏర్పడింది. పైగా రంభ, ఊర్వశి, మేనకల వంటి ఫాంటసీ పాత్రలను తీసుకుని కామెడీ చేయాలనే ఆలోచన కూడా కొత్త అవకాశాలను కల్పించింది. కానీ ఆ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడంలో సినిమా వెనుకబడింది. నేటి ప్రేక్షకులు ఆశించే కొత్త తరహా హాస్యం కాకుండా, గతంలో ఎన్నోసార్లు చూసిన కామెడీ ఫార్ములాపైనే ఎక్కువగా ఆధారపడటం ప్రధాన సమస్య. అల్లరి నరేష్ నటన, చివర్లో వచ్చే ఎమోషన్ తప్ప.. పూర్తి స్థాయి వినోదాన్ని అందించడంలో ‘రంభ ఊర్వశి మేనక’ విఫలమవుతుంది. ఫాంటసీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి ప్రయత్నించవచ్చు కానీ, నవ్వులతో థియేటర్ నుంచి బయటకు రావాలనుకునే వారికి మాత్రం ఇది పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వదు.