Anupama Parameswaran Crazy Kalyanam Movie Review
చిత్రం : క్రేజీ కళ్యాణం
రేటింగ్ : 2.25/5
నటీనటులు : డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ఉడ్డెమారి, మౌనిక తదితరులు
బ్యానర్ : యారో సినిమాస్ (Arrow Cinemas)
నిర్మాత : బూసం జగన్ మోహన్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : భద్రప్ప గాజుల
సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ) : శ్యామ్ దూపాటి
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
విడుదల తేదీ : అక్టోబర్ 16, 2026
Anupama Parameswaran Crazy Kalyanam Movie Review
కథ విషయానికొస్తే..
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథాచిత్రం ‘క్రేజీ కళ్యాణం’. పర్వతాలు (నరేష్)కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సుజికి బాలరాజు (తరుణ్ భాస్కర్)తో పెళ్లి చేస్తాడు. అయితే బాలరాజు తాగుడుకు బానిసై కుటుంబానికి సమస్యగా మారతాడు. అతని ప్రవర్తనతో పర్వతాలు కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు కీర్తి తన చదువును పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్ రాజ్)ను వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది. కానీ కూతురి భవిష్యత్తు కంటే పెళ్లి, కుటుంబ పరువు ముఖ్యమని భావించే తండ్రి ఆమె ప్రేమకు అడ్డుపడతాడు. ఈ క్రమంలో కీర్తి పెళ్లి విషయంలో అనేక మలుపులు చోటుచేసుకుంటాయి. తండ్రి నిర్ణయానికి కూతురు తలొగ్గిందా? తన ఆశయాన్ని నెరవేర్చుకుందా? ఈ ప్రయాణంలో బాలరాజు పాత్ర ఎలాంటి పరిణామాలకు కారణమైంది? అనేదే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
ఈ సినిమాకు ప్రధాన బలం నరేష్ నటన. కుటుంబ పరువు కోసం ఆరాటపడే తండ్రిగా, కూతురిపై ప్రేమను తనదైన పద్ధతిలో చూపించే వ్యక్తిగా ఆయన పాత్రలోని భిన్న కోణాలను చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో కథకంటే ఆయన పెర్ఫార్మెన్సే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ సహజంగా నటించింది. తెలంగాణ యాసను పలకడంలోనూ, తన జీవితంపై నిర్ణయం తీసుకోవాలనుకునే యువతిగా భావాలను వ్యక్తపరచడంలోనూ మెప్పించింది. తరుణ్ భాస్కర్ తాగుబోతు అల్లుడు బాలరాజుగా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఆయన పాత్ర కొన్ని చోట్ల వినోదాన్ని పంచినా, మరికొన్ని సన్నివేశాల్లో అతిగా అనిపిస్తుంది. అఖిల్ రాజ్ ఉడ్డెమారి తన పాత్ర పరిధిలో నటించాడు. మౌనిక సహా ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కథకు అవసరమైన భావోద్వేగాలను అందిస్తాయి.
టెక్నికల్ టీమ్ గురించి..
సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు తగిన వాతావరణాన్ని కల్పించింది. పాటల్లో ‘అలచంద్ర వంక’ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఎమోషన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని, పెళ్లి వేడుకల సందడిని తెరపై అందంగా చూపించింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్‌లో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే కొన్ని సన్నివేశాలను కుదించి, కథనాన్ని వేగంగా నడిపించే అవకాశం ఉండేది.
సినిమా ఎలా ఉందంటే..
‘క్రేజీ కళ్యాణం’లో దర్శకుడు ఎంచుకున్న ప్రధాన అంశం ఆడపిల్లల చదువు, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి. పెళ్లి చేయడమే బాధ్యతగా భావించకుండా, అమ్మాయిల ఆశయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని వినోదం, కుటుంబ భావోద్వేగాల కలయికతో చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో పర్వతాలు కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, బాలరాజు చేష్టలు కొంత వినోదాన్ని అందిస్తాయి. కథలోని మెయిన్ ఎలిమెంట్ మొదలైన తర్వాత కీర్తి ప్రేమకథ రొటీన్ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండటంతో కథనం పెద్దగా ఉత్కంఠను కలిగించదు. అయినప్పటికీ, తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ కథను ముందుకు నడిపిస్తుంది. సెకండాఫ్‌లో పెళ్లి చుట్టూ జరిగే పరిణామాలు కొన్ని చోట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. పాత్రలు సమస్యలను ఎదుర్కొనే విధానం మరింత బలంగా ఉండాల్సింది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో భావోద్వేగాలు పెరుగుతాయి. కూతురి భవిష్యత్తు విషయంలో తండ్రి ఆలోచనల్లో వచ్చే మార్పు, చివరి భాగంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఆడపిల్లల చదువు, స్వతంత్ర నిర్ణయాల ప్రాధాన్యతను కుటుంబ కథలో భాగంగా చెప్పడం ఈ సినిమాకు మంచి అంశం. కానీ ఈ సందేశాన్ని మరింత ప్రభావవంతంగా మలచడానికి కథనం, పాత్రల సంఘర్షణలో ఇంకాస్త బలం అవసరమైంది. కామెడీ, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నడిపించడంలో సినిమా కొన్ని చోట్ల తడబడుతుంది.
ప్లస్ పాయింట్స్
– నరేష్ నటన, తండ్రీకూతుళ్ల ఎమోషన్
– అనుపమ పరమేశ్వరన్ నేచురల్ పెర్ఫార్మెన్స్
– ఆడపిల్లల చదువుపై మంచి సందేశం
– గ్రామీణ నేపథ్యం, సంగీతం
మైనస్ పాయింట్స్
– కొన్ని చోట్ల నెమ్మదించే కథనం
– రొటీన్‌గా సాగే ప్రేమకథ
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘క్రేజీ కళ్యాణం’ నవ్వులతో పాటు కుటుంబ భావోద్వేగాలను, ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. నరేష్ నటన, అనుపమ పెర్ఫార్మెన్స్, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నా, కథలోని రొటీన్ అంశాలు, నెమ్మదైన కథనం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. మంచి సందేశం ఉన్నప్పటికీ, దాన్ని మరింత ఆసక్తికరంగా చెప్పి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. ఫ్యామిలీ స్టోరీస్, ఎమోషన్ మూవీస్ ఇష్టపడేవారికి ఒకసారి చూడదగిన సినిమా. అయితే భారీ వినోదం, వేగవంతమైన కథనం ఆశించేవారికి మాత్రం అంచనాలకు తగ్గ అనుభూతి కలగకపోవచ్చు.
Anupama Parameswaran Crazy Kalyanam Movie Review