Allu ArjunFansMeet At AAFA
ఏడు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్.. ఆరు గంటలకుపైగా సమయం
స్నేహితుల సమావేశంలా సాగిన ఫ్యాన్స్ మీట్
నచ్చని వ్యక్తులను వదిలేద్దాం అంటూ అభిమానులకు హితవు
హాజరైన సభ్యులందరికీ బీమా కవరేజీ అందించడం అద్భుతం
Allu ArjunFansMeet At AAFA
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ఉన్న అనుబంధం గురించి ఎన్నో సందర్భాల్లో ఒక మాట చెబుతుంటారు… ‘నా కెరీర్‌కు అసలైన బలం అభిమానులే’ అని. అభిమానుల ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని, వారికి ఎంత చేసినా తక్కువేనని ఆయన పలుమార్లు వెల్లడించారు. ఆ మాటలను మరోసారి చేతల్లో చూపిస్తూ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం పూర్తి రోజును కేటాయించారు.
భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA)కు చెందిన దాదాపు 1,000 మంది సభ్యులతో ఆయన ఆరు గంటలకు పైగా ఆప్యాయంగా గడిపారు. ఒక్కో అభిమానిని వ్యక్తిగతంగా పలకరిస్తూ వారి కుటుంబం, ప్రయాణం, అభిప్రాయాల గురించి తెలుసుకున్నారు. అభిమానులు చెప్పిన ప్రతి మాటను ఆసక్తిగా వింటూ, వారికి జీవితానికి ఉపయోగపడే సూచనలు కూడా చేశారు.

Allu ArjunFansMeet At AAFA
ఈ కార్యక్రమం మొత్తం ఒక స్టార్ ఈవెంట్‌లా కాకుండా, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుల సమావేశంలా సాగింది. అభిమానులతో కలిసి నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూనే అల్లు అర్జున్ డ్యాన్స్ చేశారు. తనదైన శైలిలో చేసిన చమత్కారాలు, స్పాంటేనియస్ సంభాషణలు అక్కడి వాతావరణాన్ని మరింత ఆత్మీయంగా మార్చాయి.
వచ్చిన ప్రతి అభిమానితో ప్రత్యేకంగా ఫోటోలు దిగడమే కాకుండా, వారందరికీ వ్యక్తిగతంగా ఫోటోలు అందించారు. ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంతో అక్కడి నుంచి వెళ్లేలా చూసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే… హాజరైన AAFA సభ్యులందరికీ బీమా కవరేజీ అందించడం. అభిమానుల సంక్షేమం కూడా తన బాధ్యతలో భాగమేనని అల్లు అర్జున్ మరోసారి నిరూపించారు. అభిమానులపై ఆయన చూపించే శ్రద్ధ, ప్రేమకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.
ఈ వేడుకలో పాల్గొనేందుకు అభిమానులు ఏడు రాష్ట్రాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఇది సినిమా ప్రమోషన్ కోసం కాదు… కొత్త సినిమా ప్రకటన కోసం కాదు… బ్రాండ్ ఈవెంట్ కూడా కాదు. కేవలం తనపై అపారమైన ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి, వారితో సమయం గడపడానికి అల్లు అర్జున్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సాధారణంగా అభిమానులకు తమ అభిమాన హీరోతో మాట్లాడే అవకాశం కొన్ని నిమిషాలకే పరిమితమవుతుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆరు గంటలకు పైగా ప్రతి ఒక్కరితో కలిసి గడిపి, వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అందుకే దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమాన వర్గం రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.
అల్లు అర్జున్‌కు అభిమానులు అంటే కేవలం ప్రేక్షకులు కాదు… తన ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులే. అభిమానుల ప్రేమే తనకు అతిపెద్ద అవార్డు అని ఆయన అనేక వేదికలపై చెప్పిన మాటలను ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేసింది. పరస్పర గౌరవం, అపారమైన ఆప్యాయత, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విశ్వాసంతో ఏర్పడిన ఈ బంధం ప్రతి ఏడాది మరింత బలపడుతూనే ఉందని ఈ సమావేశం స్పష్టంగా చాటిచెప్పింది.
ఇక ఈ సమావేశంలో అల్లు అర్జున్ అభిమానులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా, సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్‌పై కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారు. మనకు నచ్చని వ్యక్తులు లేదా విషయాల గురించి ఆలోచిస్తూ సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఈ విషయం నా అభిమానులతో పాటు నన్ను ట్రోల్ చేసే వాళ్లకు కూడా చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నాను. మనలో ఉండే వంద శాతం ఎనర్జీని దేనికోసం ఉపయోగిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎవరో నచ్చలేదని వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. మనకు నచ్చని వాళ్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టం కదా… అలాగే టైమ్, ఎనర్జీ కూడా ఖర్చు పెట్టొద్దు. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం వినియోగించుకోండి. మీకు నచ్చిన పని చేయండి, మీ కలల కోసం పరుగెత్తండి. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిలబడు… కనీసం ఆ కాస్త సమయాన్నైనా నువ్వు ఆనందంగా గడుపుతావు’’ అంటూ తనదైన శైలిలో సరదాగా చెప్పడంతో అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు.
అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానుల మధ్య అనవసరమైన ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్‌కు బదులుగా వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న ఆయన సందేశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.