Tollywood Star Heroes Injuries
స్టార్ హీరోలను వెంటాడుతున్న గాయాలు..!
వరుస సంఘటనలతో టాలీవుడ్లో గందరగోళం
అసలు ఏమైందంటూ అభిమానుల ఆందోళన
ఈ వరుస ఘటనలపై ప్రత్యేక కథనం
Tollywood Star Heroes Injuries
ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కఠినమైన ట్రైనింగ్‌లు, నిరంతర షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా పలువురు అగ్ర హీరోలు గాయపడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణలకు జరిగిన గాయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎన్టీఆర్ భుజానికి గాయం
ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ భుజానికి సోమవారం గాయమైంది. ‘డాక్టర్ జె.మధుసూదన్ రావు, ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యబృందం వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాలు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన షూటింగ్ షెడ్యూల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం, కోలుకోవడం గురించి తగిన సమయంలో తాము అప్డేట్స్ ఇస్తామని పీఆర్ టీమ్ తెలియజేసింది.
రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ సక్సెస్
‘పెద్ది’ మూవీ చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ మణికట్టుకు గాయం కాగా, సోమవారం తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న గంగా ఆసుపత్రిలో ఆయన కుడి చేతి మణికట్టుకు సర్జరీ
విజయవంతంగా పూర్తైంది. షూటింగ్ సమయంలోనే గాయమైనప్పటికీ, సినిమా ప్రమోషన్లు పూర్తి చేసిన తర్వాతే ఆయన సర్జరీ చేయించుకున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో, అమెరికాకు చెందిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియాతో పాటు నిపుణుల వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిరోజుల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఈ శస్త్రచికిత్సలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం పాల్గొనడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవికి వెన్నెముక శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించగా, అమెరికాలోని మయామికి చెందిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా కూడా ఇందులో భాగమయ్యారు. డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌తో కలిసి ఈ నిపుణుల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘NBK 111’ షూటింగ్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆసుపత్రిలో ఆయన ఎడమ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ను వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యుల వివరాల ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ చిట్లిపోవడంతో పాటు, మోకాలికి ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు దెబ్బతిన్నాయి. దీంతో దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించే శస్త్రచికిత్స చేపట్టినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రికి చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి మాట్లాడుతూ, “మోకాలిని నిటారుగా ఉంచి స్థిరత్వాన్ని కల్పించే టెండన్తో పాటు ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నాయి. అందుకే బలమైన, సురక్షితమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిర్వహించాం. దెబ్బతిన్న ప్రతి భాగాన్ని జాగ్రత్తగా పునర్నిర్మించాం. ఆపరేషన్ అనుకున్న విధంగానే విజయవంతంగా పూర్తైంది” అని తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విశ్రాంతి, రీహాబిలిటేషన్ పూర్తయిన తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఎందుకు పెరుగుతున్నాయి ఇలాంటి గాయాలు?
నేటి సినిమాల్లో యాక్షన్ స్థాయి గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగింది. డూప్‌లపై పూర్తిగా ఆధారపడకుండా హీరోలే ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, నెలల తరబడి ఫిట్నెస్ ట్రైనింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, విదేశీ లొకేషన్లలో నిరంతర షూటింగ్‌లు శారీరక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీని వల్ల చిన్న గాయాలు కూడా కొన్నిసార్లు శస్త్రచికిత్స వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇండస్ట్రీకి ఇది హెచ్చరికేనా?
వరుసగా స్టార్ హీరోలకు గాయాలు కావడం యాక్షన్ సినిమాల పెరుగుతున్న ఒత్తిడిని మరోసారి గుర్తు చేస్తోంది. అత్యాధునిక సేఫ్టీ ప్రోటోకాల్స్, తగిన విశ్రాంతి, మెరుగైన ఫిజికల్ మానిటరింగ్ వంటి అంశాలపై నిర్మాతలు, దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అభిమానుల ఆకాంక్షలు
స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉన్నా… వారి ఆరోగ్యం విషయంలో మాత్రం అభిమానులందరి మనసు ఒక్కటే. తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, తమ ఇష్టదైవాలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో Get Well Soon అంటూ పోస్టులు చేస్తూ.. వారు పూర్తిగా కోలుకుని త్వరలోనే తిరిగి సెట్స్‌పైకి రావాలని సినీ అభిమానులందరూ ఆకాంక్షిస్తున్నారు.