సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు పవన్ బసంశెట్టి తెరకెక్కిస్తున్న కొత్త ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు. నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున రెడ్డి, పవన్ బసంశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘రంగబలి’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ బసంశెట్టి ఈ ప్రాజెక్ట్‌కు రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కిషోర్ తిరుమల క్లాప్ ఇవ్వగా, దర్శకుడు మహేష్ బాబు పి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు యధువంశీ, సందీప్ రాజ్ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుక అనంతరం నేడు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం సత్య, యోగి బాబులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తన తొలి చిత్రం ‘రంగబలి’లో వినోదాత్మక రచనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న పవన్ బసంశెట్టి, ఈసారి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సత్య, యోగి బాబుల సహజమైన హాస్యం, అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను మరింత బలంగా ఆవిష్కరించేలా పాత్రలను మలిచినట్లు సమాచారం. ఈ ఇద్దరి కలయిక తెరపై నవ్వుల విందును పంచనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ బాబ్లు అజు ఛాయాగ్రహణం అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను కామేష్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.






👍