రివ్యూ : ‘‘సతీ లీలావతి’’ చూడటం సాహసం చేయడమే
నటీనటులు : లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, వీకే నరేష్, వీటీవీ గణేష్, మెట్ట రాజేంద్రన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు.
దర్శకత్వం : తాతినేని సత్య
రచయిత : ఉదయ్ పొట్టిపాడు
నిర్మాత : నాగ మోహన్ ఎం
సినిమాటోగ్రఫీ : బినేంద్ర మీనన్
ఎడిటర్ : సతీష్ సూర్య
మ్యూజిక్ -: మిక్కీ జే మేయర్
విడుదల తేదీ : మే 8, 2026
నిడివి : 131
వరుణ్ తేజ్‌ను వివాహమాడి మెగా కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి కొణిదెల నుంచి పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్’(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మే 8న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
భార్యభర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉంటే మంచిదో ఈ కథ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. టైటిల్ రోల్ లీలావతిగా లావణ్య త్రిపాఠిని ఓ స్టార్ డైరెక్టర్‌గా పరిచయం చేయగా, తన భర్త రామ్ సేతును (దేవ్ మోహన్) సైకలాజిస్ట్‌గా చూపించారు. లీలావతి దర్శకురాలిగా బిజీగా ఉండటంతో తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఇక ఈ బంధం కొనసాగించడం కష్టమని రామ్ సేతు ఆమెతో చెబుతాడు. అంతేకాదు, నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే మరో అమ్మాయిపై తనకు ఇష్టం పెరిగిందని చెప్పి లీలావతికి పెద్ద షాక్ ఇస్తాడు. ఆ మాటలు తట్టుకోలేని లీలావతి, భర్తను కోల్పోవాలనుకోదు. ఆవేశంలో అతడిని ఇంట్లోనే బంధించి, ఇద్దరూ కలిసి గడిపిన ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అతని మనసు మార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడే రామ్ సేతు మరో నిజాన్ని బయటపెడతాడు. ఈ పెళ్లి తన ఇష్టంతో జరగలేదని, లీలావతి కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే అంగీకరించాల్సి వచ్చిందని చెబుతాడు. ఈ నిజం లీలావతిని మానసికంగా కుదిపేస్తుండగానే ఇంట్లోకి వరుసగా కొత్త కొత్త సమస్యలు అడుగుపెడతాయి. ఆమె తండ్రి (వీకే నరేష్) , బావ (జాఫర్ సాధిక్), నికోలా, ఒక లాయర్ (విటివి గణేష్) ఒక్కొక్కరుగా రావడం మొదలవుతుంది. ఇంట్లో రామ్ సేతు బంధించబడి ఉండటంతో, ఆ రహస్యం బయటపడకుండా లీలావతి ప్రతి పరిస్థితిని చాకచక్యంగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇంతలో మరో చిక్కు ఎదురవుతుంది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుని మాట తప్పిందనే కోపంతో ఓ నిర్మాత (మొట్ట రాజేందర్) లీలావతిని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో ఓ దొంగ (సప్తగిరి) ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంట్లో దాచిన భర్త, బయట నుంచి వచ్చే అనుకోని అతిథులు, మరోవైపు కిడ్నాప్ డ్రామా ఈ గందరగోళం చివరకు ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేదే కథలో ఆసక్తికర అంశం. చివరికి రామ్ సేతు నిజంగా లీలావతి దగ్గరే ఉంటాడా? లేక నికోలాతో కొత్త జీవితం ఎంచుకుంటాడా? ఆ రహస్యాలన్నీ ఎలా బయటపడతాయో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
కొంత గ్యాప్ తర్వాత లావణ్య త్రిపాఠి నుంచి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. మోడర్న్ లీలావతిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక దేవ్ మోహన్ యాక్టింగ్ కాస్త డల్‌గా ఉందనే చెప్పాలి. ‘శాకుంతలం’లో సమంతకు జోడీగా కనిపించిన దేవ్.. ఇప్పుడు లావణ్య జంటగా నటించారు. మరోవైపు మడోన్నా సెబాస్టియన్ గ్లామర్‌కు యాడ్ అవుతుందని భావించారు కానీ వర్కవుట్ కాలేదు. లీలావతి తల్లీదండ్రులుగా వీకే నరేష్ , పవిత్రా లోకేష్ కనిపించారు తప్ప.. నటించలేదు. అలాగే వీటీవీ గణేష్ పాత్ర ఎందుకుందో కూడా తెలియకుండా చెట్టు కింద ప్లీడర్ తరహాలో నీరసంగా సాగింది. నిర్మాతగా మొట్టు రాజేంద్రన్ నటన విసుగు తెప్పిస్తుంది. ఇక సప్తగిరి, తాగుబోతు రమేష్ నవ్వించాలనే ప్రయత్నం చేశారు కానీ ఎవరికీ నవ్వు రాదు. ఇలాంటి స్టార్ కాస్ట్ ఉన్నా ఎలాంటి ఫలితం లేదనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఎలా ఉందంటే..
ఈ సినిమా అంతా ఒకరోజులో జరిగే కథ. భార్యాభర్తల మధ్య జరిగే తగాదాలను కామెడీగా మలచాలని ప్రయత్నించినా, ఆ హాస్యం ఎక్కువగా పనిచేయదు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించిన లీలా సేతు ప్రేమకథ కూడా చాలా సాధారణంగా, అంతగా ప్రభావం లేకుండా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథలో కాస్త గందరగోళం పెరుగుతుంది. లీల కిడ్నాప్ కావడం, ఓ దొంగ ఇంట్లోకి రావడం, ఆమెను ఎవరు రక్షిస్తారు అనే అంశాలతో కథ ముందుకు వెళ్తుంది. మధ్యలో భార్యాభర్తల భావోద్వేగాలను కలపాలని దర్శకుడు ప్రయత్నించినా, ఆ ఎమోషన్ పూర్తిగా ప్రేక్షకుడికి చేరదు. సినిమా మొత్తం ఎటు వెళ్తుందో స్పష్టత లేకుండా సాగుతుండగా, చివర్లో రెండు ట్విస్టులు పెట్టడం మాత్రం చెప్పుకోదగ్గ విషయం. కామెడీ కోసం సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేందర్ వంటి పలువురిని తీసుకున్నా ఆశించిన ఫలితం కనిపించదు. ఒకటి రెండు సందర్భాలు తప్పితే నవ్వు పుట్టించే సన్నివేశాలు చాలా తక్కువ. కొన్ని చోట్ల అయితే కథకు సంబంధం లేకుండా సన్నివేశాలు వచ్చి పడిన భావన కలుగుతుంది. సినిమా ప్రారంభంలో చిన్నప్పటి ఎపిసోడ్ ద్వారా రామ్ సేతు, లీలావతి చిన్నప్పుడే పరిచయం అయినట్టు చూపిస్తారు. కానీ తర్వాత మళ్లీ ఏదో కొత్తగా పరిచయం అయినట్టు చూపించడం సింక్ లేకుండా ఉంటుంది. భార్యాభర్తల బంధం, అనుబంధం గురించి సినిమాలో చాలానే సంభాషణలు ఉన్నా అవి సహజంగా అనిపించవు. కొన్ని డైలాగులు మరీ బలహీనంగా అనిపిస్తాయి. ముఖ్యంగా లీలా–సేతు మధ్య సరైన భావోద్వేగ బలం లేకుండానే రామ్ సేతు పాత్రలో వచ్చే మార్పు పూర్తిగా నమ్మదగినట్టుగా కనిపించదు. కథ మధ్యలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనిపించడం మాత్రం ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు మాత్రం ప్రత్యేకంగా గుర్తుండేలా లేవు. డబ్బింగ్ ఈ సినిమాకు ప్రధానమైన మైనస్. ముఖ్యంగా ప్రధాన పాత్రల వాయిస్‌లు చాలా చోట్ల అసహజంగా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో అనవసరంగా సాగిన కొన్ని ల్యాగ్ సీన్స్ తగ్గించి ఉంటే కథ మరింత కట్టుదిట్టంగా ఉండేది. సినిమా దాదాపు ఒకే లొకేషన్ చుట్టూ తిరిగినా నిర్మాణ విలువల్లో మాత్రం లోటు కనిపించదు. తాతినేని సత్య గతంలో భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ వంటి సినిమాలు తీసిన దర్శకుడు కావడంతో, ఈసారి ఆయన నుంచి వచ్చిన అవుట్‌పుట్ కొంత నిరాశ కలిగిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
భార్యభర్తల బంధం గురించి బలంగా చెప్పాలనుకునే ప్రయత్నం
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
స్టార్ కాస్ట్ ఉన్నా సరిగా ఉపయోగించుకోకపోవడం
డబ్బింగ్ సరిగా లేకపోవడం
బోరింగ్ డైలాగ్స్, బోరింగ్ సీన్స్
“భర్త దూరమవుతానంటే భార్య అతడిని తిరిగి తనవైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం” అనే కోణంలో కామెడీ-ఎమోషన్ మేళవింపుతో కథ చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. ఫైనల్‌గా ‘సతీ లీలావతి’ చూడటం ఓ పెద్ద సాహసం అనే చెప్పాలి.
రేటింగ్ : 2/5







