‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం
రాజమౌళి సినిమాకు షాక్.. 150 వాటర్ ట్యాంకర్లకు నో చెప్పిన అధికారులు
మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్‌ట్రోటర్ యాక్షన్ అడ్వంచర్ మూవీ ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) నుంచి తిరస్కరణ ఎదురైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని గగన్‌పహాడ్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో అండర్‌వాటర్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ కోసం ప్రొడక్షన్ టీమ్‌కు భారీ నీటి అవసరం ఏర్పడింది. దీనికోసం మూవీ టీమ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)ను 150 వాటర్ ట్యాంకర్ల (ప్రతి ఒక్కటి 10,000 లీటర్లు) సరఫరా చేయాలని కోరింది. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా భరిచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికారులు అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్‌లో పెరుగుతున్న వేసవి తీవ్రత మధ్య, నీటి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాము వాటర్ ట్యాంకర్లు ఇవ్వలేమని వాటర్ బోర్డ్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం నగరంలో నీటి సరఫరాపై తీవ్ర ఒత్తిడి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున నీటిని సినిమా షూటింగ్ కోసం కేటాయించడం సాధ్యం కాదని తెలిపారు. ముఖ్యంగా ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తామని వారు వెల్లడించారు. అయితే నీటి సమస్య కారణంగా షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశముందా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
అయితే రాజమౌళి సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ ఒక్క విషయంలోనూ ఆయన కాంప్రమైజ్ అవ్వరు. అలాగే ఎక్కువ టైమ్ తీసుకున్నా ఆయన అనుకున్న అవుట్‌పుట్ వచ్చేవరకు వెయిట్ చేస్తారు. మరి దీనికోసం కూడా ఏదైనా ప్లాన్ బీ ఏర్పాటు చేస్తారా, లేదంటే వెయిట్ చేస్తారో తెలియాల్సి ఉంది.
మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన రాజమౌళి.. అందుకు తగ్గట్టుగా సూపర్ ఫాస్ట్‌గా సినిమాను పూర్తి చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ సహా మెయిట్ టీమ్ అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దాదాపు ఎనభై శాతం వరకూ షూట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. అదీకాక గ్రాఫిక్స్ సంబంధించిన సన్నివేశాలు ముందుగా చిత్రీకరించి వీఎఫ్‌ఎక్స్ కంపెనీలకు అప్పగించారు. మిగతా సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా పక్కా ప్లానింగ్‌తో అనుకున్న తేదీకి ‘వారణాసి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.




