రివ్యూ: గాయపడ్డ సింహం
నటీనటులు :- తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, శ్రీవిష్ణు, విష్ణు ఓయ్, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్, ప్రదీప్ రావత్, యాంకర్ ఝాన్సీ, అనీష్ కురువిల్లా, కృష్ణ భగవాన్
దర్శకత్వం : కశ్యప్ శ్రీనివాస్
కథ : సూర్య ప్రకాష్ జోస్యుల
నిర్మాతలు : కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్
సినిమాటోగ్రఫీ : విద్యాసాగర్ చింతా
ఎడిటర్ : విప్లప్ నైషధం
మ్యూజిక్ -: స్వీకార్ అగస్తీ
విడుదల తేదీ : మే 1, 2026
నిడివి : 140 నిమిషాలు
తరుణ్ భాస్కర్ హీరోగా, జేడీ చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా, శ్రీవిష్ణు కీలక పాత్రల్లో నటించిన ‘గాయపడ్డ సింహం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రంప్‌పై రివెంజ్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం .
కథ విషయానికొస్తే..
దరహాస్ (తరుణ్ భాస్కర్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలంటే అమెరికాలో సెటిల్ కావాల్సిందే అనే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే సమయంలో అమెరికా పాలసీల కారణంగా ఇండియన్స్ డిపోర్ట్ అవ్వడం అతని కలలను ఛేదిస్తుంది. ఈ పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని నమ్మిన దరహాస్, ఒక అసాధారణమైన ప్లాన్ వేస్తాడు. ట్రంప్‌పై చేతబడి చేసి పగ తీర్చుకోవడం! ఈ వింత ఆలోచనను అమలు చేయడానికి క్షుద్ర విద్యల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఐఏఎస్ అభ్యర్థి భైరవ్ దాస్ (శ్రీవిష్ణు) సహాయం తీసుకుంటాడు. ఇక్కడి నుంచి కథ పూర్తిగా ఒక అబ్సర్డ్ కామెడీ ట్రాక్‌లోకి వెళ్తుంది. వైట్ హౌస్ నుంచి ట్రంప్ వెంట్రుకలను తెప్పించడం, గ్యాంగ్‌స్టర్ బ్రూతల్ ధర్మ (జేడీ చక్రవర్తి) ఎంట్రీతో ఏర్పడే గందరగోళం ఇవన్నీ కలిపి సినిమా ఒక డార్క్ కామెడీ జానర్లో నడుస్తుంది.
కథలో కొన్ని కొత్త కోణాలు ఉన్నా, కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువై, కథనం కొద్దిగా నెమ్మదిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
తరుణ్ భాస్కర్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ రోల్. నటనలో నిజాయితీ కనిపించినా, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఇంకా ఇంపాక్ట్ ఉండాల్సింది. జేడీ చక్రవర్తి ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటాడు. బ్రూటల్ ధర్మ పాత్రలో ఆయన కనిపించిన తీరు కొత్తగా ఉంటుంది. ఫరియా అబ్దుల్లా గ్లామర్ మాత్రమే కాదు, కథలో కొంత వెయిట్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. తనదైన స్పెషల్ స్టైల్లో కొన్ని సీన్స్‌ను శ్రీవిష్ణు హైలెట్ చేస్తాడు. శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికొస్తే..
మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్లో డైరెక్టర్ తడబాటు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పరంగా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఫ్రేమింగ్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగున్నా, గుర్తుపెట్టుకునే స్థాయిలో లేదు. ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అయ్యేది.
ఎలా ఉందంటే..
ఈ కాన్సెప్ట్ డిఫరెంట్‌గా అనిపించినా.. ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం, ట్రంప్‌పై చేతబడి చేయాలనుకోవడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయంలో అందరూ తమ పాత్రల్లో జీవించారు. శ్రీవిష్ణుతో సిచ్చువేషన్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అయితే కొన్ని పాత్రలు మాత్రం.. కథను ముందుకు నడిపించే విషయంలో ఆశించిన స్థాయిలో పట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం అలా సాగిపోతుందే తప్ప, ప్రేక్షకుడికి క్యూరియాసిటీ ఉండదు.
ప్లస్ పాయింట్స్ :
కొత్త తరహా కాన్సెప్ట్
తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటన
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
నెమ్మదైన నేరేషన్
ప్రిడిక్టబుల్ ట్రాక్‌లు
కాస్త లాగ్
మొత్తానికి ‘గాయపడ్డ సింహం’ ఒక మంచి ఐడియాతో మొదలై, పూర్తి స్థాయిలో గర్జించలేకపోయిన సినిమా. కొన్ని సన్నివేశాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ల వల్ల చూసేలా ఉన్నా, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే లోపం కారణంగా పూర్తి సంతృప్తి ఇవ్వదు.
రేటింగ్: 2.25/5







