తెలుగు సినీ ప్రేక్షకులకు మరో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ‘సతీ లీలావతి’ సినిమా రాబోతోంది. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు తాతినేని సత్య
సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉండాలి? వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవన ప్రయాణాన్ని ఎలా సాగిస్తారు? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, వినోదాన్ని మేళవిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను మలిచినట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. త్వరలో ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతోంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా బలంగా నిలుస్తోంది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో నరేష్ వి.కె, సప్తగిరి, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం కలిసిన ‘సతీ లీలావతి’ ఈ సమ్మర్‌కు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్‌ను వివాహమాడిన తర్వాత లావణ్యత్రిపాఠి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘సతీ లీలావతి’ కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఏడాది క్రితం ఓ బిడ్డకు (కుమారుడు వాయు తేజ్) తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఆమె కమిట్ అయిన ఈ సినిమాను పూర్తి చేశారు లావణ్య త్రిపాఠి కొణిదెల.





