Kiran Abbavaram RECORD Launched
ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కెరీర్లో 14వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రికార్డ్’ (RECORD) అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Kiran Abbavaram RECORD Launched
ఈ సినిమా ప్రారంభోత్సవానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో పాటు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
‘రికార్డ్’ టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ పోస్టర్లకు భిన్నంగా కెమెరా టెక్నికల్ పదాలను ఉపయోగిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్లో ఎర్రటి పౌర్ణమి చంద్రుడి ముందు కిరణ్ అబ్బవరం సిల్హౌట్ కనిపిస్తోంది. చంద్రుడి కింద గాడిద, చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయి వంటి అంశాలు పోస్టర్‌కు మిస్టీరియస్ టచ్ ఇచ్చాయి. అసలు ఈ కథలో ఏదో ప్రత్యేకత ఉందనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తోంది. దీంతో సినిమా జానర్, కథాంశంపై ఆసక్తి మొదలైంది.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సుకుమార్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ‘క’ సినిమా తర్వాత మరోసారి వంశీ నందిపాటి గారితో అసోసియేషన్ కుదరడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత అశోక్ బండ్రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. 18 ఏళ్ల పాటు మీడియాలో పనిచేసిన వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయన చెప్పిన కథతో పాటు సినిమాపై ఉన్న తపన తనకు బాగా నచ్చాయని వెల్లడించారు. ‘రికార్డ్’ టైటిల్‌లాగే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని, ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమ గర్వపడే సినిమా అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న ‘రికార్డ్’ సినిమా ఇండస్ట్రీలోని రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాలని కోరారు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. ది స్టోరీస్ సంస్థ ద్వారా అశోక్ బండ్రెడ్డితో కలిసి సినిమా నిర్మించడం, సుకుమార్ రైటింగ్స్‌తో అసోసియేట్ కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన సుకుమార్, కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత అశోక్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ కథను నమ్మి అంగీకరించిన కిరణ్ అబ్బవరంకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు వీర కోగటం మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు.
18 ఏళ్ల మీడియా అనుభవం తర్వాత మెగాఫోన్ పట్టిన వీర కోగటం తన తొలి సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ వేడుకకు హాజరై తనను ఆశీర్వదించిన స్నేహితులు, సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రేక్షకులకు మంచి సినిమాను అందిస్తానని అన్నారు.
ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.