Aadi Saikumar Arundhati Nakshatram Begins
విభిన్న కథలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్న హీరో ఆది సాయికుమార్ మరో కొత్త సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ శ్రీనివాస్‌తో ఆది నటిస్తున్న చిత్రం ‘అరుంధతి నక్షత్రం’. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇది ఆది సాయికుమార్ కెరీర్లో 28వ సినిమా.
Aadi Saikumar Arundhati Nakshatram Begins
ఈ చిత్రంలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా. సూర్యకాంతి కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర బృందం, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయికుమార్ క్లాప్ కొట్టగా, నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చిత్ర నిర్మాతలు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియో గ్లింప్స్ ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో కనిపించిన మెమొరీ కార్డ్, ఫొటోల కాన్సెప్ట్‌ను గుర్తుచేస్తూ వినూత్నంగా ఈ అనౌన్స్మెంట్ వీడియోను రూపొందించారు. ఇందులోని విజువల్స్ చూస్తుంటే పల్లెటూరి వాతావరణం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో కూడిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.