Roshan Meka Superhero Debut
టాలీవుడ్లో సూపర్‌హీరో జానర్‌కు మరో ఆసక్తికరమైన సినిమా తోడవుతోంది. శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ మేకను సరికొత్త అవతార్‌లో పరిచయం చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు శ్రీకారం చుట్టారు. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.3గా రూపొందిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
Roshan Meka Superhero Debut
ఈ వేడుకలో ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కింది.
విభిన్నమైన కథాంశాలు, ప్రత్యేకమైన కథనాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటికి సూపర్‌హీరో సినిమా చేయాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కల. ఇప్పుడు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రోషన్ మేకతో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం దాదాపు ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్వహించారు. కథ, కథనాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్‌తో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో రోషన్ కనిపించనున్నారు. పవర్ఫుల్ సూపర్‌హీరోగా ఆయనను పరిచయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. రోషన్‌కు జోడీగా బాలీవుడ్ నటి రేఖా పాండే నటిస్తుండగా, ఈ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మరోవైపు నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. పి.జి. విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో తన సంగీతంతో ఆకట్టుకున్న గౌర హరి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే భారీ స్థాయిలో విజువల్ వరల్డ్‌ను రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్తో పాటు రామకృష్ణ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షించనున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.