Rashmika’s Strong Reply
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచారు. తనను విమర్శించే వారిపై స్పందిస్తూనే.. తన కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై అలాగే విజయ్ దేవరకొండతో తన రిలేషన్‌షిప్‌పై నెట్టింట జరుగుతున్న చర్చలపై ఆమె సుదీర్ఘమైన నోట్స్ రూపంలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. మరోవైపు, పదేళ్లు గడిచినా తనను అభిమానిస్తూ, ప్రేమను చూపిస్తున్న కన్నడ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Rashmika’s Strong Reply
నా గురించి మాట్లాడండి.. నా కుటుంబాన్ని మాత్రం వదిలేయండి!
తనపై వ్యక్తిగత విమర్శలు చేసేవారికి గట్టి సమాధానం ఇచ్చారు రష్మిక. తన గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చని, అలాంటి విమర్శలను తాను తట్టుకోగలనని పేర్కొన్నారు. అయితే, తన కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం మాత్రం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. గడ్డు కాలంలో తనకు ఎవరూ లేరని, కానీ ‘అతను’ (విజ్జు) మాత్రం ప్రతి కష్ట సమయంలోనూ తన వెంటే ఉన్నాడని స్పష్టం చేశారు. కష్ట సమయంలో తోడుగా లేనివాళ్లు ఇప్పుడు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని, సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలు, వక్రీకరించిన ఎడిట్లను నమ్మడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం గురించి తెలియకుండా వ్యాఖ్యలు చేయడాన్ని ఫెమినిజం అనలేమని, అది ఫెమినిజం ముసుగులో జరిగే వేధింపులేనని అభిప్రాయపడ్డారు. స్త్రీవాదం అంటే ఇతరులను కించపరచడం లేదా తాము గొప్పవారమని నిరూపించుకోవడం కాదని వివరించారు. స్త్రీ అయినా, పురుషుడైనా తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉండటమే ఫెమినిజం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకున్నానని, ఆ నిర్ణయం తనకు అపారమైన ప్రేమను అందించిందని రష్మిక చెప్పుకొచ్చారు. తన జీవితంపై తానే బాధ్యత తీసుకోవడం వల్ల ఎంతో ప్రేమను పొందాననే భావనను ఈ పోస్టులో వ్యక్తం చేశారు.
తన కన్నడ అభిమానులను ఉద్దేశించి రష్మిక భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు. పదేళ్లు గడిచినా తనను అంతే ప్రేమతో గుర్తుపెట్టుకుని, అభిమానిస్తున్న వారి ప్రేమ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఇంతకాలం తర్వాత కూడా తనను సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానుల ప్రేమకు తాను ఎంతో అదృష్టవంతురాలినని చెప్పారు. ప్రేమను, ఆనందాన్ని పంచుకునే ప్రతి ఒక్కరికీ తన ప్రేమను తెలియజేశారు. అలాగే, ప్రతి ఒక్కరూ తమకు సంతోషాన్నిచ్చే విషయాన్ని వెతుక్కోవాలని ఆకాంక్షించారు.
రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ గౌరవం, మహిళల నిర్ణయాధికారం వంటి అంశాలను మరోసారి చర్చలోకి తెచ్చాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు రావడం సాధారణంగా మారిన నేపథ్యంలో.. తనపై విమర్శలను స్వీకరించగలనని, కానీ తన కుటుంబం గురించి ఆధారాలు లేకుండా మాట్లాడటాన్ని అంగీకరించనని ఆమె చెప్పిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.