Bhogi-annayya-paanam-song-released
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. పల్లెటూరి జీవనశైలి, అక్కడి సంప్రదాయాలు, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులను సహజంగా ఆవిష్కరించే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తొలి పాట ‘ఎగిలివారంగ’ సినిమాకు సంబంధించిన పల్లె నేపథ్యాన్ని పరిచయం చేసింది.
Bhogi-annayya-paanam-song-released
తాజాగా దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం, త్యాగాన్ని చూపించేలా.. ‘అన్నయ్య పానం’ పాటను విడుదల చేశారు మేకర్స్. కుటుంబ బంధాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా సాగిన ఈ పాట ప్రతి ఒక్కరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. పాటలో ఐదుగురు చెల్లెళ్లపై ఓ అన్నయ్య చూపించే నిస్వార్థ ప్రేమను హార్ట్ టచ్చింగ్‌గా చూపించారు.
వారి సంతోషం కోసం తపించే అన్నయ్య అనుబంధాన్ని భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. అదే సమయంలో శర్వా, అనుపమ పరమేశ్వరన్ మధ్య సాగే ప్రేమకథకు సంబంధించిన అందమైన క్షణాలు కూడా పాటలో చోటుచేసుకున్నాయి. దీంతో కుటుంబ భావోద్వేగాలతో పాటు రొమాంటిక్ టచ్ కూడా ఈ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
పల్లెటూరి నేపథ్యానికి సరిపోయేలా భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. హృదయాన్ని తాకే మెలోడీతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బాణీ పాటను వినసొంపుగా మార్చింది. ఆస్కార్ విజేత, రచయిత చంద్రబోస్ అందించిన సాహిత్యం అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమను, ఆప్యాయతను, త్యాగాన్ని అందంగా ప్రతిబింబిస్తోంది. సింగర్ శ్రీకృష్ణ తన గాత్రంతో పాటలోని భావాలను మరింత ప్రభావవంతంగా పలికించారు.
విజువల్స్ పరంగా కూడా ‘అన్నయ్య పానం’ ఆకట్టుకుంటోంది. పల్లెటూరి అందాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయమైన సన్నివేశాలు పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. అనీ మాస్టర్ కొరియోగ్రఫీ పాటలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సాగింది. పల్లెటూరి యువకుడి పాత్రలో శర్వా తన సహజమైన లుక్‌తో ఆకట్టుకోగా, తన నటనలోని పరిణతితో పాత్రకు మరింత బలాన్ని చేకూర్చారు. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ తన అందం, అభినయంతో అలరించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.