Indian 3 Officially Announced: Senapathy Returns in War Mode
స్టార్ డైరెక్టర్ శంకర్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ చూపించిన విశ్వరూపం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం అభిమానులను నిరాశపరిచింది.


Indian 3 Officially Announced: Senapathy Returns in War Mode
అయితే ‘భారతీయుడు 2’ ఫలితంతో ఈ ఫ్రాంచైజీకి బ్రేక్ పడుతుందని భావించిన సమయంలో ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘భారతీయుడు 3’ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ సమర్పణలో, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ‘భారతీయుడు 3’ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “The Resurgence Begins” అంటూ మేకర్స్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా “War Mode” అనే పదంతో సేనాపతి మరోసారి జీరో టాలరెన్స్‌తో రంగంలోకి దిగబోతున్నాడనే హింట్ ఇచ్చారు. పోస్టర్లో ముగ్గురు గుర్రపు స్వారీలను చూపిస్తూ, మధ్యలో సేనాపతి ఉన్నట్టుగా డిజైన్ చేయడం సినిమాకు యుద్ధ నేపథ్యాన్ని సూచించేలా ఉంది. అంతేకాదు.. మొదటి భాగంతో సేనాపతి పాత్రకు వచ్చిన క్రేజ్, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌కు ఉన్న బ్రాండ్, ‘భారతీయుడు 2’తో ఏర్పడిన అసంతృప్తిని మూడో భాగంతో అధిగమించాలనే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
‘భారతీయుడు’ అంటేనే కమల్ హాసన్ నటన, శంకర్ విజన్ గుర్తొస్తాయి. ఇప్పుడు మూడో భాగాన్ని ‘వార్ మెడ్’ అంటూ ప్రకటించడంతో ఈసారి కథ మరింత భారీగా, యాక్షన్‌తో నిండిన స్థాయిలో ఉండబోతుందా అనే ఆసక్తి మొదలైంది. కమల్ హాసన్ సేనాపతిగా మరోసారి ఎలా కనిపించబోతున్నారు? ‘భారతీయుడు 2’లో మిగిలిన ప్రశ్నలకు ‘భారతీయుడు 3’లో ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? ఈసారి శంకర్ ఎలాంటి కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.