Husharu 2: Double Fun Full Madness
యూత్‌కి కనెక్ట్ అయ్యే కథ, ఫ్రెండ్షిప్, ఫన్, ఫుల్ ఎనర్జీ.. ఇవన్నీ కలగలిపి 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘హుషారు’. అప్పట్లో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘హుషారు’కు సీక్వెల్‌గా ‘హుషారు 2’ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Husharu 2: Double Fun Full Madness
ఈ సందర్భంగా విడుదల చేసిన ‘హుషారు 2’ టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. మొదటి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన ‘కబూమ్ బీరు’ కనిపిస్తుంది. ఓ ట్రక్కును కొందరు వ్యక్తులు రెండు వైపులా పట్టుకుని లాగుతుండగా.. వారి చేతుల్లో తాడుల స్థానంలో పాము కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పాము మధ్యలోనే కొందరు స్నేహితులు చిక్కుకుని భయపడుతున్నట్టుగా కనిపిస్తారు. ట్రక్కు కింద తాబేలు.. మరోవైపు బంగారు నగలతో నిండిన పెట్టె.. వెనుక ఫ్యాక్టరీ.. ఇలా పోస్టర్‌లోని ప్రతి ఎలిమెంట్‌కి ఏదో ఒక అర్థం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సాగర మథనం చేసిన పురాణ ఘట్టాన్ని గుర్తు చేసేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ‘హుషారు 2’ కథకు అమృత మథనానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ తాబేలు, పాము, బంగారు పెట్టె వెనుక ఉన్న కథేంటి? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
‘హుషారు’లో కనిపించిన యూత్‌ఫుల్ ఎనర్జీ, ఫ్రెండ్షిప్, కామెడీకి మరింత పెద్ద స్కేల్లో సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్నెస్, నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ‘హుషారు 2’ను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం యూత్‌లో క్రియేట్ చేసిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి మరింత కొత్తగా, మరింత ఎంటర్టైనింగ్గా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
‘హుషారు’ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీహర్ష కొనుగంటి సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ పల్స్, ఆధునిక సంబంధాలు, కామెడీ టైమింగ్‌ను తెరపై సహజంగా ఆవిష్కరించడంలో తనకున్న ప్రత్యేకతను మరోసారి చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు, భగవాన్ తివారి, జతిన్ గోసామి, రజయ్ రోవన్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమాను భారీ స్థాయిలో పూర్తి చేసి ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏడాది చివర్లో ‘హుషారు 2’ను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కేవ్‌మ్యాన్ స్టోరీస్, హెచ్‌కె ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్లపై రాహుల్ వర్మ, కె.వీణా రాణి, కె.హనుమంత్ రాజు నిర్మిస్తున్నారు. కోమటిరెడ్డి శరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.