ShivaKandukuri Talcum Powder Glimpse
క్రైమ్ కథలకు కామెడీని జోడిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఓ చిన్న తప్పు.. దాని వెనుక పెద్ద చిక్కులు.. ఒకవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్స్టర్లు.. మధ్యలో నలిగిపోయే ఓ డ్రగ్ పెడ్లర్! ఈ కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా, వినోదాత్మకంగా తెరపైకి తీసుకొస్తోంది ‘టాల్కమ్ పౌడర్’ సినిమా. టైటిల్‌తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. తాజాగా విడుదలైన ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ గ్లింప్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ShivaKandukuri Talcum Powder Glimpse
‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘చూసి చూడంగానే’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ నిర్మాత రాజ్ కందుకూరి.. ఈసారి డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నారు. తన ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ కందుకూరి హీరోగా ‘టాల్కమ్ పౌడర్’ను నిర్మిస్తున్నారు. సాయినాథ్ పొన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ద్రిషికా చందర్ హీరోయిన్గా నటిస్తుంది. న్యూ ఏజ్ క్రైమ్ డ్రామెడీగా రూపొందుతున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
తాజాగా విడుదలైన ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ గ్లింప్స్ చూస్తే.. బంటీ అనే డ్రగ్ పెడ్లర్ చుట్టూనే ఈ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. అనుకోకుండా జరిగిన ఓ తప్పు అతడి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. అప్పటివరకు ఒకలా సాగిన అతడి ప్రయాణం.. ఒక్కసారిగా క్రైమ్, ఛేజింగ్‌లు, ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతడి కోసం పోలీసులు రంగంలోకి దిగితే.. గ్యాంగ్స్టర్లు మరోవైపు వెంటపడతారు. ఈ రెండు వర్గాల మధ్య బంటీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తనను తాను ఎలా కాపాడుకున్నాడు? అన్నది సినిమాలో చూడాల్సిందే. గ్లింప్స్‌లోని క్యారెక్టర్లు, వాటి మధ్య కనిపించే గందరగోళం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
సాధారణ క్రైమ్ డ్రామాలకు భిన్నంగా.. ఇందులో ఫన్, డ్రామా, క్రైమ్ అంశాలను కలగలిపినట్లు తెలుస్తోంది. క్విర్కీ క్యారెక్టర్లు, రేసీ స్క్రీన్‌ప్లే, అనూహ్యమైన మలుపులతో దర్శకుడు సాయినాథ్ పొన్న ఓ కొత్త తరహా ఎంటర్టైనర్ను సిద్ధం చేసినట్లు గ్లింప్స్ హింట్ ఇస్తోంది. శివ కందుకూరి ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. నటుడు, దర్శకుడు వెంకటేష్ మహా, జీవన్ కుమార్‌తో పాటు ఇతర నటీనటుల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగానూ గ్లింప్స్‌లో మంచి క్వాలిటీ కనిపించింది. జీవీ అజయ్ కుమార్ అందించిన స్టైలిష్ విజువల్స్, ఓషో వి సంగీతం సినిమాకు ప్రత్యేకమైన మూడ్‌ను తీసుకొచ్చాయి. సూర్య పొన్నపల్లి ఎడిటింగ్ కూడా కథనంలోని వేగాన్ని ప్రతిబింబిస్తోంది.
మొత్తానికి టైటిల్ దగ్గర్నుంచి గ్లింప్స్ వరకు ప్రతిదాంట్లోనూ ఓ డిఫరెంట్ ట్రీట్మెంట్ కనిపిస్తున్న ‘టాల్కమ్ పౌడర్’.. ఈసారి రాజ్ కందుకూరి నుంచి రాబోతున్న మరో ప్రయోగాత్మక చిత్రంగా నిలవనుంది. మరి బంటీ చేసే చిన్న తప్పు ఎలాంటి పెద్ద రచ్చకు దారితీస్తుందో తెలియాలంటే నవంబర్ 13 వరకు ఎదురుచూడాల్సిందే. ఆ రోజున ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.