Mandadi Movie Blockbuster Celebrations
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటున్న చిత్రం ‘మండాడి’. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కించారు. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి విడుదల చేసింది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి సంబంధించి యునానిమస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను చిత్రబృందం శనివారం ఘనంగా నిర్వహించింది.
Mandadi Movie Blockbuster Celebrations
ఈ సందర్భంగా హీరో సూరి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘మండాడి’కి తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణ తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. సినిమా విడుదలకు ముందే మైత్రి టీమ్ ఈ చిత్రం విజయం సాధిస్తుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాకు బ్లాక్‌బస్టర్ స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు మదిమారన్, నిర్మాత ఎల్రెడ్ కుమార్‌తో పాటు తనతో కలిసి ఈ జర్నీలో ప్రయాణించిన సుహాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ ‘మండాడి’ని ఇంత పెద్ద విజయంగా నిలబెట్టిన ప్రేక్షకులకు, తమకు అండగా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. సినిమా చూసిన వెంటనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని మైత్రి నవీన్ చెప్పారని తెలిపారు. తాము పెట్టిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని, ముఖ్యంగా సూరి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. తనకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు మదిమారన్కు ధన్యవాదాలు తెలిపారు.
మైత్రి నవీన్ మాట్లాడుతూ ‘మండాడి’ చూసిన వెంటనే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరగనున్నాయని చెప్పారు. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలోనే ఆస్వాదించాలని కోరారు.
మైత్రి రవి మాట్లాడుతూ సినిమా పూర్తికాకముందే ‘మండాడి’పై తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. కొన్ని నెలల క్రితం బిజినెస్ కట్ చూసిన వెంటనే సినిమాను తీసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు పడుతున్నాయని, ఈ ఏడాదిలో తమకు దక్కిన బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘మండాడి’ ఒకటిగా నిలిచిందన్నారు. సుహాస్, సూరి కాంబినేషన్‌తో పాటు బోట్ సీక్వెన్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు.
చిత్ర నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ ‘మండాడి’ కంటెంట్ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మొదటి నుంచే ఉందన్నారు. విడుదల తర్వాత అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, డిస్ట్రిబ్యూటర్లు సైతం సంతోషంగా ఉన్నారని తెలిపారు. తన గత చిత్రం ‘రంగం’ తరహాలోనే ‘మండాడి’కి కూడా ప్రేక్షకాదరణ లభిస్తోందని చెప్పారు. దర్శకుడు మదిమారన్తో పాటు సూరి, సుహాస్, మహిమా నంబియార్, పీటర్ హెయిన్ సహా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు మదిమారన్ పుగళేంది మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ‘మండాడి’ని సెలబ్రేట్ చేస్తున్న తీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సినిమాకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. మంచి సినిమాకు భాష, సరిహద్దులు అడ్డంకులు కావని మరోసారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ ‘మండాడి’లాంటి మంచి చిత్రాన్ని తమకు అందించిన నిర్మాత ఎల్రెడ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా చూసిన వెంటనే ఇది విజయం సాధిస్తుందని అనిపించిందన్నారు. మొదటి రోజే అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు నమోదయ్యాయని, ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో రోజుకే స్క్రీన్ల సంఖ్యను పెంచామని తెలిపారు. ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరోయిన్ మహిమా నంబియార్ మాట్లాడుతూ ‘మండాడి’ విజయంపై మొదటి నుంచే నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఇంతటి ప్రేమ వస్తుందని ఊహించలేదన్నారు. అన్ని భాషల్లోనూ మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యంగా బోట్ రేస్ సీక్వెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. ‘మండాడి’కి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మంచి చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉందన్నారు.