7 PM Productions Launches EMI
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కొత్త నటీనటులు, ప్రతిభావంతులైన టెక్నీషియన్స్‌కు అవకాశమిస్తూ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇ.ఎం.ఐ’. ఎమోషన్, వినోదం కలగలిపిన వినూత్న కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది.
7 PM Productions Launches EMI
నిఖిల్ కువ్వరపు ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పలు వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన దరహాస్ ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. అలాగే ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో కీలక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న శైలజ కథానాయికగా నటిస్తున్నారు.
‘ఇ.ఎం.ఐ’ చిత్రాన్ని బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేటి రోజుల్లో బైక్ కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, ఖరీదైన మొబైల్ కొనుగోలు చేయాలన్నా ఈఎంఐ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో నెలవారీ ఈఎంఐలు జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే వస్తువులు సులభంగా కొనుగోలు చేయడానికి ఉపయోగపడే ఈఎంఐలు, వాటిని చెల్లించే సమయంలో యువత ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిళ్లు, సరదా సంఘటనలు, భావోద్వేగాలను ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
ఈ పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా దర్శకుడు నిఖిల్ కువ్వరపు కథను సిద్ధం చేశారు. సినిమాలోని సన్నివేశాలు యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యేలా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో తెరకెక్కించడంతో పాటు, విడుదల సమయంలో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
‘ఇ.ఎం.ఐ’తో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తోంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్‌తో కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
మంచి కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను నిర్మించేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది.