Venkatesh AK 47 Movie Release Postpone
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించారు. సినిమాలోని ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Venkatesh AK 47 Movie Release Postpone
‘ఏకే 47’ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ గతంలో అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకోవడంతో అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టడంతో రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చాలామంది భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్ 2న సినిమా విడుదల కావడం కాస్త కష్టమేననే టాక్ వినిపిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమవుతోందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ రిలీజ్‌ను కొద్దిరోజులు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఏకే 47’ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. అంటే ముందుగా ప్రకటించిన అక్టోబర్ 2 తేదీ నుంచి సుమారు రెండు వారాల పాటు సినిమాను వాయిదా వేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దసరా సీజన్‌పై కన్నేసిన మేకర్స్
అక్టోబర్ 16న సినిమాను విడుదల చేయాలనే ఆలోచన వెనుక ప్రధాన కారణం దసరా సెలవుల సీజన్ అని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు పండుగ సీజన్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉండటంతో.. దసరా హాలిడేస్‌ను టార్గెట్ చేస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ముఖ్యంగా వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ను వెంకటేష్ ఇమేజ్‌కు జోడిస్తే పండుగ సీజన్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కథలోని కుటుంబ నేపథ్యం, పాత్రల మధ్య సంబంధాలు, ఎమోషన్స్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్‌కు సరిపోయేలా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్తో స్పష్టమవుతోంది. ముఖ్యంగా గతంలో వెంకటేష్ నటించిన నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల సక్సెస్‌లో రైటర్‌గా త్రివిక్రమ్‌కు ఎంతో పేరు వచ్చింది. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘ఏకే 47’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.