A New Wave from Singareni: Kotha Cinema
సినిమా తీయాలంటే హైదరాబాద్‌కే రావాల్సిన అవసరం లేదని, కథలో విషయం ఉంటే ఎక్కడి నుంచైనా వెండితెరపై తమ ప్రతిభను చాటుకోవచ్చని నిరూపించే ప్రయత్నమే ‘కొత్త సినిమా’. సింగరేణి ప్రాంతానికి చెందిన స్థానిక ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తూ దర్శకుడు అజర్ రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దాదాపు వంద మంది కొత్త ప్రతిభావంతులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
A New Wave from Singareni: Kotha Cinema
సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు దర్శకులు, నిర్మాతలు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.
హీరో రాకేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చానని తెలిపారు. సినిమా విడుదలయ్యే వరకు తనకు సహకారం అందించాలని కోరారు. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు.
హీరో సురేష్ మాట్లాడుతూ.. ఒక సినిమాలో తాను ప్రధాన పాత్రలో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని, అజర్ తనకు ఆ అవకాశాన్ని ఇచ్చారని తెలిపారు. సినిమా తీయడం బయటకు కనిపించినంత సులభం కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దర్శకుడు సినిమాను పూర్తి చేశారని చెప్పారు.
దర్శకుడు అజర్ మాట్లాడుతూ.. కొత్త వాళ్లకు ఎవరూ అవకాశాలు ఇవ్వరు అనే భావనతోనే మొదట ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని, అయితే తమను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా తన ఆలోచనలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించానన్నారు. తన కథను ఇతర నిర్మాతల వద్దకు తీసుకెళ్లకుండా తానే నిర్మించాలని నిర్ణయించుకున్నానని అజర్ తెలిపారు. తనతో పాటు కొత్తవారికి అవకాశాలు ఇస్తానంటే మొదట ఎవరూ నమ్మలేదని, చివరకు సొంత ప్రాంతంలోనే ఆడిషన్స్ నిర్వహించి ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేశామని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యామని తెలిపారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘కొత్త సినిమా’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది ఒక కొత్త ప్రయత్నమని అభినందించారు. సొంత ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి సినిమా రూపొందించడం గొప్ప విషయమన్నారు. అజర్ చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
దర్శక నిర్మాత ఎన్. శంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి బయటకు తీసుకురావడం ముఖ్యమన్నారు. సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన టెక్నీషియన్స్‌తో కలిసి అజర్ సినిమా రూపొందించడం అభినందనీయమని చెప్పారు. ఈ చిత్రం సహజమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకున్నారు.
దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. ఒక ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకుని రూపొందిన సినిమాలు ఆ ప్రాంతానికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా సింగరేణి ప్రాంతం నేపథ్యంగా వస్తున్న ‘కొత్త సినిమా’తో ఆ ప్రాంతానికి మరింత పేరు రావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. అవకాశాలు రాలేదని ఎవరినీ నిందించకుండా, ఉన్న పరిధిలోనే సినిమా తీసిన అజర్‌ను అభినందించారు. ఒకప్పుడు ‘హృదయకాలేయం’తో సాయి రాజేశ్ చేసిన ప్రయత్నం గుర్తుకొస్తోందని, అదే తరహాలో ‘కొత్త సినిమా’ కూడా ఒక ప్రత్యేక ప్రయత్నంగా నిలవాలని అన్నారు. అజర్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. దర్శకుడికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని, అజర్‌లో ఆ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ‘కొత్త సినిమా’లో క్రియేటివ్, ఇన్నోవేటివ్ కంటెంట్ కనిపిస్తోందని, దర్శకుడిగా అజర్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నారు.
డీవోపీ జానీ బాషా మాట్లాడుతూ.. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వరకు తమ ప్రయాణానికి ప్రేక్షకులు, సినీ ప్రముఖుల ప్రోత్సాహమే కారణమన్నారు. అజర్ ప్రతి ఒక్కరిలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు కల్పించారని, తెలియని వారికి శిక్షణ ఇచ్చి సినిమాను రూపొందించారని తెలిపారు. వర్క్ పట్ల నిజాయితీగా ఉంటే విజయం సాధించవచ్చని ఈ సినిమా ద్వారా అజర్ నిరూపించబోతున్నారని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ.. ‘కొత్త సినిమా’కు సంగీతం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. సినిమాలోని పాటలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పారు.
క్రిటిక్ చల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కొత్త సినిమా’ పోస్టర్ తన దృష్టిని ఆకర్షించిందని, దర్శకుడు అజర్ గురించి ఆరా తీశానని తెలిపారు. ప్రస్తుతం సహజత్వంతో కూడిన ‘ఆర్గానిక్’ సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోందని, ఈ చిత్రం కూడా అలాంటి సహజమైన కథనంతో రూపొందిందని భావిస్తున్నానని అన్నారు.
మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలుగు సినిమా ప్రయాణానికి భిన్నంగా, సింగరేణి గడ్డపై స్థానిక ప్రతిభతో రూపొందిన ‘కొత్త సినిమా’ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వంద మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.