Akhil Raj Naga Durga Join Hands For Shanarthi
తెలంగాణ పల్లె వాతావరణం, మనసుకు హత్తుకునే ప్రేమకథ, స్వచ్ఛమైన గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘శనార్తి’. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో ఆకట్టుకున్న అఖిల్ రాజ్, తెలంగాణ జానపద గీతాల్లో తన ఉత్సాహభరితమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ జంటగా నటిస్తున్నారు.
Akhil Raj Naga Durga Join Hands For Shanarthi
తెలంగాణలో పల్లెటూళ్లలో ఆత్మీయంగా పలకరించుకునే పదంగా ‘శనార్తి’కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రేమ, ఆప్యాయత, సంప్రదాయం, సంస్కృతి వంటి అంశాలను ప్రతిబింబించే ఈ టైటిల్.. కథకు సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం చెబుతోంది.
టైటిల్ పోస్టర్ కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పసుపు పచ్చ, ఎరుపు రంగుల్లో ఉన్న రెండు చేతులు ఒకదానినొకటి పట్టుకోవడం ద్వారా విభిన్నతలో ఏకత్వం, అనుబంధం, సంప్రదాయాలను సూచించారు. రెండు చేతుల మణికట్టులకు పవిత్రమైన జంధ్యాలు, ఎరుపు రంగు చేతికి సంప్రదాయ ఎర్ర గాజుల దండను అలంకరించారు. పసుపు, కుంకుమ రంగులతో రూపొందించిన ఈ పోస్టర్ తెలంగాణ పల్లె సంస్కృతి, ఆచారాలు, వేడుకలను గుర్తు చేస్తోంది. ‘A Tale of Culture’ అనే ట్యాగ్‌లైన్ సినిమాకు సంబంధించిన నేపథ్యాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తోంది.

సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయితగా సంపత్ నంది వద్ద పనిచేసిన గణేష్.. ఈ కథను ఆయనకు వినిపించగా, కథ నచ్చడంతో సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచారు. అఖిల్ రాజ్, నాగదుర్గ జంటతో తెరపై ఓ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నామని దర్శకుడు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. “శనార్తి’ పల్లెటూరిలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు ఉపయోగించే పదం. ఈ ప్రేమకథకు ఈ పదం అచ్చంగా సరిపోతుంది. అఖిల్‌కు ఈ కథ చాలా నచ్చింది. నాగదుర్గను హీరోయిన్ పాత్రకు అఖిల్‌నే సజెస్ట్ చేశాడు. ఆమె వీడియోలు చూసినప్పుడు ఈ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనిపించింది. ఇద్దరూ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తారు” అని అన్నారు.
దర్శకుడు రాజ్ గణేష్ మాట్లాడుతూ.. “అందరికీ శనార్తి. సంపత్ నంది గారు నా బలం. ఆయన దగ్గర రచయితగా పనిచేశాను. ఈ కథ చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది. అఖిల్ రాజ్, నాగదుర్గతో మ్యాజిక్ చేయబోతున్నాం. సంపత్ నంది గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు” అని తెలిపారు.
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా, కథలోని భావోద్వేగాలను మరింత బలపరిచేలా సంగీతాన్ని రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. సంపత్ నందితో కలిసి పనిచేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరుతోందని సురేష్ బొబ్బిలి అన్నారు.
సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్లపై కె.వి. శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, చిత్రబృందం సమక్షంలో ‘శనార్తి’ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.