Chiru Leaks Mega 158 Title
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఈవెంట్‌కు వెళ్లినా.. అక్కడ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టడం, అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ‘చిరు లీక్స్’ అంటూ ఫ్యాన్స్ సరదాగా పిలుచుకునే ఈ ట్రెండ్ మరోసారి రిపీట్ అయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఆయన 158వ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను బయటకు తీసుకొచ్చాయి.
Chiru Leaks Mega 158 Title
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో మెగా 158 గురించి అప్డేట్ అడిగినప్పుడు చిరంజీవి తనదైన స్టైల్లో స్పందించారు. సంగీత దర్శకుడు థమన్‌తో మాట్లాడుతున్న సమయంలో ‘సేమ్ టైటిల్ కదిరి…’ అంటూ టైటిల్లోని కీలక పదాన్ని ప్రస్తావించి, వెంటనే ఆపేశారు.
https://x.com/Pinkvillat24/status/2087181120957997222?s=20
దీంతో మెగా 158 టైటిల్ ‘కదిరి’తో మొదలవుతుందా? అనే చర్చ మొదలైంది. దీంతో కదిరిపై వచ్చే టైటిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కదిరి నరసింహుడు’ అని, మరికొందరు ‘కదిరి కాకా’ అనే టైటిల్ ఫైనల్ అని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే మరో 10 రోజులు ఎదురుచూడాల్సిందే. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న మెగా 158 నుంచి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు ఈ ఈవెంట్ ద్వారా క్రేజీ అప్డేట్ అందించారు మెగాస్టార్. ఈ వీడియో గ్లింప్స్ కోసం తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అదిరిపోతుంది అంటూ చిరంజీవి తెలియజేశారు.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుండగా, ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.