Samantha Maa Inti Bangaram Joins100 Crore Club
స్టార్ హీరోల సపోర్ట్ లేకుండా.. భారీ ఫ్రాంచైజీల హంగామా లేకుండా.. కేవలం కథ, కంటెంట్, సమంత స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ దాటిన ఈ చిత్రం.. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల విజయ గాథను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
Samantha Maa Inti Bangaram Joins100 Crore Club
ఇప్పటివరకు వచ్చిన తెలుగు లేడీ-ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘మా ఇంటి బంగారం’.. కేవలం కలెక్షన్ల పరంగానే కాదు, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా 300 శాతానికి పైగా రికవరీ నమోదు చేసింది. దీంతో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా భారీ మార్కెట్ ఉందని మరోసారి నిరూపించింది.
ఓవర్సీస్లోనూ ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. మహిళా ప్రధాన చిత్రాల్లోనే 2.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాదు.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మహిళా ప్రధాన చిత్రాల జాబితాలో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
Samantha Maa Inti Bangaram Joins100 Crore Club
ఈ విజయంపై స్పందించిన సమంత.. “ఇది మాకు కేవలం రూ.100 కోట్ల మైలురాయి మాత్రమే కాదు. భాషతో సంబంధం లేకుండా, బలమైన మహిళా ప్రధాన కథలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకానికి ఇది మరో పెద్ద నిదర్శనం” అని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించిన రాజ్ కె. నిడిమోరు మాట్లాడుతూ.. “చివరికి నేను ఒక తెలుగు సినిమా చేశాను. ప్రేక్షకులు ఈ సినిమాను తమదిగా భావించి చూపించిన ప్రేమ జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అన్నారు.
నిర్మాత హిమాంక్ రెడ్డి దువ్వూరు మాట్లాడుతూ.. “మహిళా ప్రధాన చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరడం పరిశ్రమకు ఒక మైలురాయి. ‘మా ఇంటి బంగారం’ ప్రకటన నుంచి విడుదల వరకు ప్రతి దశా సినీ పరిశ్రమలో కేస్ స్టడీగా నిలిచే ప్రయాణం” అని తెలిపారు.
రాజ్ కె. నిడిమోరు ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 19, 2026న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తమిళంలో ‘ఎంగళ్ తంగం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం, సహజమైన యాక్షన్ సన్నివేశాలు, సిట్యుయేషనల్ కామెడీ, కుటుంబ భావోద్వేగాలు కలిసి ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేశాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
Samantha Maa Inti Bangaram Joins100 Crore Club
ఒకప్పుడు మహిళా ప్రధాన సినిమాలు పరిమిత వసూళ్లకే పరిమితం అవుతాయనే అభిప్రాయాన్ని ‘మా ఇంటి బంగారం’ పూర్తిగా చెరిపేసింది. స్టార్ పవర్ కంటే బలమైన కథ, నమ్మకమైన ప్రదర్శన ఉంటే ప్రేక్షకులు విజయాన్ని ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్తారో ఈ చిత్రం మరోసారి నిరూపించింది.