Mahesh Babu Praise Boosts Rao Bahadur Buzz
సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ విడుదలకు ముందే టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదల చేసిన ‘మోర్ దాన్ ఏ టీజర్’ వీడియో ఆ ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన పవర్ఫుల్ వాయిస్ఓవర్ ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వీడియోలో కథను పూర్తిగా చెప్పకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేశారు. “When drama begins, logic ends” అనే భావనకు మహేష్ బాబు తన నేరేషన్లో కొత్త కోణాన్ని జోడిస్తూ, “డ్రామాతో పాటు మ్యాజిక్ కలిస్తే… లాజిక్కు కొత్త అర్థం పుడుతుంది” అని చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే “ఇక్కడ మ్యాజిక్ అంటే గారడి కాదు… దృశ్య కావ్యం” అనే డైలాగ్ సినిమా విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతోందో సూచిస్తోంది.
https://x.com/Pinkvillat24/status/2071959334108717259?s=20
ఈ వీడియో చివర్లో మహేష్ బాబు చెప్పిన “మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా… రావు బహదూర్” అనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో ఇంతటి నమ్మకంతో సినిమా గురించి మాట్లాడటం చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది.
Mahesh Babu Praise Boosts Rao Bahadur Buzz 
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత అనురాగ్ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహేష్ బాబు కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తారని, ‘రావు బహదూర్’ కూడా అలాంటి విభిన్న చిత్రమేనని చెప్పారు. సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు దాదాపు 40 నిమిషాల పాటు టీమ్‌తో సినిమా గురించి చర్చించారని, అదే తమకు విజయం సాధించినట్లే అనిపించిందని తెలిపారు. ఇప్పటికే కొందరు ప్రముఖులకు సినిమా చూపించామని, చూసిన ప్రతి ఒక్కరూ “ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు” అని అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కథనం, మేకింగ్, పెర్ఫార్మెన్స్లను ఈ చిత్రం అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, ‘రావు బహదూర్’ తెలుగు సినిమా కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సమయంలో కూడా తనపై సందేహాలు వ్యక్తమయ్యాయని, కానీ ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరించారని గుర్తు చేశారు. అత్యంత భావోద్వేగంగా మాట్లాడిన ఆయన, మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత “ఇలాంటి తెలుగు సినిమా నేను ఇంతకుముందు చూడలేదు” అని చెప్పడం తనకు జీవితంలో లభించిన గొప్ప ప్రశంస అని అన్నారు. అంతేకాదు, స్వయంగా వాయిస్ఓవర్ ఇవ్వాలని ముందుకు రావడం జీవితాంతం గుర్తుండిపోయే గౌరవమని చెప్పారు.
హీరో సత్యదేవ్ ఈ సినిమాపై తన నమ్మకాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేశారు. “తెలుగు సినిమాకు మేము రాస్తున్న ప్రేమలేఖే ‘రావు బహదూర్’” అని పేర్కొంటూ, మహేష్ బాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు తనను ‘రావు బహదూర్ సత్యదేవ్’ అని పిలుస్తారనే నమ్మకం ఉందన్నారు. ‘జ్యోతి లక్ష్మి’ తన కెరీర్‌కు ఎలా మలుపు తీసుకువచ్చిందో, అదే స్థాయిలో ‘రావు బహదూర్’ మరో కీలక మలుపు అవుతుందని తెలిపారు. దర్శకుడు వెంకటేష్ మహా కూడా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని వెల్లడించారు.
నిర్మాత గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా ఒక్కసారి చూసి ఆగిపోని అనుభూతిని ఇస్తుందని, మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమని అన్నారు. కుటుంబ సమేతంగా చూసే మ్యాజికల్ ఎంటర్టైనర్గా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
మరో నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ, ‘రావు బహదూర్’ లాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదని, థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక కొత్త సినీ అనుభూతితో బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
హీరోయిన్ దీప థామస్ ఈ సినిమాతో తన కల నెరవేరిందని చెప్పారు. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ తనకు ఎంతో ఇష్టమైన చిత్రమని, అలాంటి దర్శకుడితో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
‘మోర్ దాన్ ఏ టీజర్’ ద్వారా కథపై సస్పెన్స్‌ను కొనసాగిస్తూనే, సినిమా విజువల్ గ్రాండియర్, భావోద్వేగం, సైకలాజికల్ డ్రామా అంశాలపై బలమైన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు చేసిన ప్రశంసలు, చిత్రబృందం వ్యక్తం చేసిన నమ్మకం చూస్తుంటే ‘రావు బహదూర్’ సాధారణ కమర్షియల్ సినిమా కాదని, తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన సినీ అనుభూతిని అందించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ భారీ అంచనాలకు సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలుసుకోవాలంటే జూలై 3 వరకు వేచి చూడాల్సిందే.