DSP Yellamma Video
తనదైన సంగీతంతో మ్యూజిక్ లవర్స్‌ను ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా కూడా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ చిత్రం తర్వాత వేణు యెల్దండి దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రమిది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది అమ్మవారి భక్తికి, గ్రామీణ గాయక బృందాల జీవిత పోరాటాలకు సంబంధించిన భావోద్వేగమైన కథ. ఈ నేపథ్యంలో మంగళవారం దేవిశ్రీ ప్రసాద్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. తమ స్వగ్రామం అయిన వెదురుపాక విలేజ్‌ను చూపిస్తూ తన తండ్రి సత్యమూర్తిని గుర్తుచేసుకుంటూ ఆ గ్రామానికి వెళ్లారు. తన స్వగ్రామ సంస్కృతి, జానపద కళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంగా రూపొందించిన ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “DSP & The Spirit of His Village” అనే థీమ్‌తో రూపొందిన ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని వేదురుపాక గ్రామాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
DSP Yellamma Video
గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర, సంప్రదాయ వేడుకలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పుల వాయిద్యాలు, నృత్యాలు, గ్రామీణ జీవనశైలి వంటి అంశాలను ఈ వీడియోలో ఎమోషనల్‌గా చూపించారు. ముఖ్యంగా జానపద కళాకారుల ప్రతిభకు గౌరవం తెలుపుతూ రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వీడియోలో గ్రామ ఆలయం, పండుగ సందడి, రంగురంగుల లైటింగ్ మధ్య కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో “Love and Respect to the Amazing Folk Artists Around the World” అనే సందేశంతో జానపద కళాకారుల పట్ల దేవిశ్రీ ప్రసాద్ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఫైనల్‌గా ‘ఎల్లమ్మ’ మూవీ టీమ్ తరపున ఈ కళాకారులందరికీ ట్రిబ్యూట్‌గా ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలియజేశారు. ఈ వీడియో ద్వారా దేవి శ్రీ ప్రసాద్ గ్రామీణ కళలకు తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.